ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ను రాష్ట్ర సచివాలయంలో  కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఓటర్ లిస్ట్ నమోదు, సవరణల ప్రక్రియలో తమ సిబ్బంది పక్కగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. 


అయితే ప్రస్తుతం అదనంగా ఈవీఎంల మొదటి స్థాయి షెడ్యూల్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు విడుదల చేశారని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే విధులు నిర్వహిస్తామని కానీ తెలుగువారి ప్రధాన పండుగలైన దుర్గాష్టమి, విజయదశమి, దీపావళి పండగ రోజులను సెలవుగా ప్రకటించాలని కోరారు. ఈ పండగలు నేపథ్యంలో తమ ఉద్యోగులు, సిబ్బందుల నుంచి అనేక వినతులు వస్తున్న నేపథ్యంలో ఈవీఎంల షెడ్యూల్ లో సెలవు రోజులను ప్రకటించాలని వెల్లడించారు.


ఒత్తిడితో రెవిన్యూ ఉద్యోగులు సతమతతం 


ఎన్నికల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్నా.. పని భారం, మానసిక ఒత్తిడితో పాటు ఆర్ధిక ఒత్తిడితో రెవిన్యూ ఉద్యోగులు సతమతమవుతున్నారు అని వారు ఆరోపించారు. వీటి నుంచి కొంత మినహాయింపుగా పండగలకు సెలవు దినాలు ప్రకటిస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పారు. ఎన్నికల కార్యకలాపాలను ఒత్తిడి లేకుండా సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కోరింది.


రాష్ట్ర సచివాలయములో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలసి, క్షేత్రస్థాయిలో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 (ఓటర్ లిష్ట్లు నమోదు, సవరణ) నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎలెక్టోరల్ రోల్ రివిజన్ సంబందించిన ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమయ్యారని తెలిపారు. ఇలాంటి సమయంలో రీ సర్వే, అసైన్డ్ భూములు డేటా తదితర శాఖ పరమైన పనులు పూర్తి చేయుటకు టార్గెట్లను పెట్టీ, రోజూ టెలీకాన్ఫరెన్స్, సమీక్షా సమావేశాలుతో జిల్లా యంత్రాంగము నుండి వస్తున్న ఒత్తిడిని అధికమించలేకపోతున్నామని తెలిపారు.


 ఓటర్ లిస్టులు నమోదు, సవరణ (SSR -2024) కార్యక్రమాల్ని విజయవంతంగా చేసేందుకు రెవెన్యూ సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి లేకుండా, సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రీ సర్వే మరియు అదనపు విధులు, అదనపు లక్ష్యాలు ఇవ్వకుండా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారులకు సూచనలు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బిఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు అనేక రకాల విధులకు హాజరవుతున్నందున ఓటర్ల జాబితాల సవరణ పూర్తయ్యే వరకు ఎలెక్టోరల్ రోల్ రివిజన్ విధులకు మాత్రమే హాజరయ్యేలా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయాలి అని కోరారు.


రెవెన్యూ ఉద్యోగులలో తీవ్ర ఒత్తిడి మరియు పని ఒత్తిడి ఉన్నందున ఎలక్టోరల్ రోల్స్ యొక్క సవరణ విధులను విజయవంతంగా పూర్తి చేయడానికి, రీసర్వే మరియు ఇతర శాఖా విధులు & ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లపై లక్ష్యాలను నిర్దేశించ వద్దని ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. ఈ నాటికీ పెండింగ్‌లో ఉన్న 2019లో జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కొన్ని జిల్లాలు సమర్పించిన బిల్లులను మంజూరు చేయాలి అని విజ్ఞప్తి చేశారు.  


ఈ విజ్ఞప్తులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సానుకూలంగా స్పందించినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించి ఒత్తిడి తగ్గించేందుకు తగిన సూచనలు చేస్తాననిహామీ ఇచ్చారని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.