Chandrababu makes key comments on Andhra Pradesh population management:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రసంగం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ కు ప్రాధాన్యత ఇచ్చామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు  తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే 2047 నాటికి రాష్ట్రం వృద్ధాప్య సమస్యను ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ, జనాభా సమతుల్యతను కాపాడుకోవడానికి సరికొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ'ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

Continues below advertisement

వృద్ధాప్యం దిశగా  ఆంధ్రప్రదేశ్                  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.5 శాతానికి  పడిపోయిందని సీఎం వెల్లడించారు. సుస్థిర ప్రగతి సాధించాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 1992లో 3 శాతంగా ఉన్న ఈ రేటు, ఇప్పుడు సగానికి పడిపోయిది. 2023 లెక్కల ప్రకారం ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నప్పటికీ, 57 శాతం మంది దంపతులు ఒక్క బిడ్డతోనే ఆగిపోతున్నారని, కేవలం 9 శాతం మంది మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువ మందిని కంటున్నారని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ప్రస్తుతం 10 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2047 నాటికి  23 శాతానికి చేరుతుందని, ఫలితంగా మానవ వనరుల కొరత తీవ్రమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Continues below advertisement

పలు దేశాల్లో జనాభా సమస్య

జపాన్ (1.2), దక్షిణ కొరియా (0.7) వంటి దేశాల్లో సంతానోత్పత్తి రేటు పడిపోవడం వల్ల అక్కడ మానవ వనరులు తగ్గి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని సీఎం గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో బీహార్ (3.0) వంటి రాష్ట్రాల్లో జనాభా వృద్ధి ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు (1.4), కేరళ (1.6) తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. తక్షణమే చక్కదిద్దుకోకపోతే రాబోయే తరంలో పని చేసే యువత కంటే, విశ్రాంతి తీసుకునే వృద్ధులే ఎక్కువ అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

 పురుషులకు  పితృత్వ సెలవులు 

ఈ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు ప్రతిపాదించింది. పిల్లల పెంపకం కేవలం తల్లుల బాధ్యతే కాదని, తండ్రులు కూడా భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. దీనికోసం పురుషులకు కూడా పిల్లల సంరక్షణ సెలవులు కల్పించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగం చేసే మహిళల కోసం కార్యాలయాల్లోనే  చైల్డ్ కేర్ సెంటర్లు  ఏర్పాటు చేస్తామని, ఆర్థిక భారంతో పిల్లలను వద్దనుకునే వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ప్రోత్సాహకాలతో డ్రాఫ్ట్ పాలసీ 

సంతానోత్పత్తిని ప్రోత్సహించే దిశగా, ప్రసవ సమయంలో మహిళలకు  రూ. 25,000 ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రూపొందించిన ఈ ముసాయిదా పై నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని, మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే దీనికి తుది రూపం ఇస్తామని సభకు వివరించారు. కేవలం సంపాదన కోసమే పిల్లలను వద్దనుకోవడం సరైనది కాదని, మానవ వనరులే రాష్ట్రానికి అసలైన సంపద అని ఆయన ముగించారు.