Bihar CM Nitish Kumar files nomination for Rajya Sabha: బిహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్, తన పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభకు నామినేషన్ వేయడానికి ముందు నితీష్ కుమార్ భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. గత రెండు దశాబ్దాలుగా బిహార్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో పూర్తి అంకితభావంతో సేవ చేశాను. బిహార్ అభివృద్ధికి నా వంతు కృషి చేశాను అని ఆయన పేర్కొన్నారు. తన పార్లమెంటరీ ప్రస్థానంలో ఉభయ సభలు లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఉండాలనేది తన చిరకాల కోరికని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాట్నాలో నితీష్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ప్రక్రియ ముగిసింది. 75 ఏళ్ల వయసున్న నితీష్, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాజ్యసభ సభ్యుడిగా లేరు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకుంటూ ఢిల్లీ పీఠం వైపు వెళ్తున్నారు.
జేడీయూ శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఆయన అధికారికంగా రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. దీంతో దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన ఆయన సుదీర్ఘ పాలన ముగియనుంది. నితీష్ వైదొలగడంతో బిహార్‌లో బీజేపీకి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు రేసులో ముందుండగా, నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారనే వార్తలపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము మొదటి నుంచీ చెబుతున్నదే ఇప్పుడు నిజమైందని వ్యాఖ్యానించారు. నితీష్ జీని పెళ్లికొడుకును చేసి గుర్రం ఎక్కించారు కానీ, పీటల మీదకు వచ్చేసరికి వేరే వారితో పెళ్లి జరిపిస్తున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బిజెపి పన్నాగంలో భాగంగానే నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి ఢిల్లీకి పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ కుమార్ ఝా దీనిని అంగీకారంతో కూడిన కిడ్నాప్ అని అభివర్ణించారు. జేడీయూను నామరూపాలు లేకుండా చేసేందుకే బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేసిందని ఆయన విమర్శించారు. నితీష్ కుమార్ స్వచ్ఛందంగా వెళ్తున్నట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి ఆయనను బలవంతంగా పక్కకు తప్పుకునేలా ఒత్తిడి తెచ్చారని ఆర్జేడీ నేతలు మృత్యుంజయ్ తివారీ వంటి వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మార్పును తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందిస్తూ.. ఇది ప్రజలిచ్చిన తీర్పును వంచించడమేనని, రాష్ట్రంలో నాయకత్వ కుట్ర జరిగిందని విమర్శించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ నాయకత్వంలో ఓట్లు అడిగిన బీజేపీ, ఇప్పుడు పగ్గాలు తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆయనను రాజ్యసభకు పంపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ రాజకీయ పరిణామం బిహార్‌లో ఒక యుగానికి ముగింపు పలికిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం ద్వారా బిహార్‌లో బీజేపీకి సొంతంగా ముఖ్యమంత్రిని నియమించుకునే అవకాశం దక్కిందని, ఇది జేడీయూ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.