YS Jagan Pulivendula Tour: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) శనివారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల పర్యటన (Pulivendula Tour)కు వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ (Kadapa Airport)కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరి వెళతారు. జగన్ మూడు రోజుల పాటు పులివెందులలో ఉంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. 


జూన్ 19నే వెళ్లాల్సిన జగన్
వైఎస్ జగన్ వాస్తవానికి ఈ నెల 19న పులివెందులకు వెళ్లాల్సి ఉంది. రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అలాగే 20వ తేదీన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులతో జగన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన పులివెందుల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 


ఆ పని ఇష్టం లేక వెళ్తున్నారా?
శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. శనివారం ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే శాసనసభకు రాకూడదని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్పీకర్‌‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని జగన్‌ ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరినప్పుడు స్పీకర్‌ను అధికార, విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్‌ వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 


ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లేముందు జగన్ శాసన సభ్యులకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్‌ సభ నుంచి ఛాంబర్‌కు వెళ్లిపోయారు. 


వెనుక గేటు నుంచి అసెంబ్లీ లోకి ఎంట్రీ
ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి వచ్చారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం మీదుగా నేరుగా సభకు వచ్చేవారు. అయితే అమరావతి రైతులు నిరసన తెలిపే అవకాశం ఉందని భావించిన జగన్ వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. సమయం కంటే ముందుగానే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత, తన ప్రమాణ స్వీకార సమయం వచ్చినపుడే సభలోకి వెళ్లారు.