ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 42,679 పరీక్షలు నిర్వహించగా 839 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా కోవిడ్ బులిటెన్ సోమవారం విడుదల చేసింది. ఇవాళ్టి కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,39,529 మంది కరోనా బారినపడినట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని బులిటెన్ లో ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,078కు చేరింది. 24 గంటల వ్యవధిలో 1,142 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 20,11,063కి చేరిందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. 


Also Read: Vijayawada News: డ్రగ్స్ ముఠాతో విజయవాడకు సంబంధంలేదన్న సీపీ శ్రీనివాసులు... గుజరాత్ ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల హెరాయిన్ పట్టివేత...






ప్రస్తుతం ఏపీలో 14,388 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,77,63,761 నమూనాలను పరీక్షించారు. కోవిడ్‌తో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 231, నెల్లూరు జిల్లాలో 149 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 101 కేసులు నమోదయ్యాయి. 


తెలంగాణలో కొత్తగా 208 కోవిడ్ కేసులు


తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. కొత్తగా 208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కి చేరింది. కరోనా బారి నుంచి 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


అక్టోబర్ నుంచి వ్యాక్సిన్ల ఎగుమతి


కరోనా వ్యాక్సిన్లను అక్టోబర్ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతి, విరాళంగా ఇవ్వడం చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. భారతీయులకు టీకా ఇవ్వడమే తొలి ప్రాధాన్యమని ఆయన తెలిపారు. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన టీకాలను మైత్రి కార్యక్రమం ద్వారా సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. సోమవారం ఈ ప్రకటన వెలువడింది. 


కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్‌ నెలలో 30 కోట్లు, వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 100 కోట్ల డోసులు అందుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత 11 రోజుల్లో 10 కోట్ల డోసులు పంపిణీ చేశామని తెలిపారు. దేశ ప్రజల అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా చేస్తామని తెలిపారు. అక్టోబర్‌-డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ మైత్రి, కోవాక్స్‌కు ఎగుమతులు, విరాళాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి మాండవీయ ప్రకటించారు. 


Also Read: TollyWood Meet : ప్రభుత్వ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌కు టాలీవుడ్ ఓకే ! పేర్ని నానితో భేటీలో కీలక నిర్ణయాలు