Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగైదు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలన్నీ రాజకీయాలను షురూ చేశాయి. బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయి. సభల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రసంగాలు, విమర్శలతో షెడ్యూల్ రాకముందే ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. ప్రజలను ఆకట్టుకునేందకు పార్టీలు రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఇటీవల మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్‌ను టీడీపీ, జనసేన ప్రకటించాయి. ఇక వైసీపీ కూడా సిద్దం సభలతో ప్రజల్లోకి వెళుతుంంది.


ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు


ఇక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఈసీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే పార్టీలతో కూడా భేటీ అవుతుంది. అందులో భాగంగా గురువారం విజయవాడలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఏపీ ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా సమావేశమయ్యారు. వైసీపీ, టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల మార్గదర్శాలను పార్టీకి సీఈవో వివరించారు. ఎన్నికల నిబంధనలను పార్టీలకు వివరించారు. నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పార్టీలన్నీ సహకరించాలని మీనా కోరారు.


చంద్రబాబు, పవన్‌తో భేటీ


గతంలో ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో అన్ని పార్టీల నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈసీ సభ్యులను కలిశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసీ ప్రతినిధులను కలిసి ఏపీలోని దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై కంప్లైంట్ ఇచ్చారు. అలాగే సచివాలయ సిబ్బందిని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, ఇతర ప్రాంతాల్లో నివసించే వారి ఓట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు. అప్పట్లో దాదాపు ఆరగంట పాటు సీఈసీ బృందంతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఏపీలోని పరిస్థితులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడంపై కూడా  ఫిర్యాదు చేశారు. పార్టీల ఫిర్యాదులను స్వీకరించిన సీఈసీ సభ్యులు.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి అన్ని పార్టీల ప్రతినిధులతో ఈసీ సమావేశం నిర్వహించింది.


ఈ నెల 13న షెడ్యూల్?


ఈ నెల 13న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేందుకు ఈసీ రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు మార్చి 19న షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఏప్రిల్ 11 నుంచి 19వ తేదీ వరకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. అనంతరం మే 23న ఫలితాలు రిలీజ్ చేశారు. ఈ సారి కూడా అటుఇటుగా షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.