Janasena party: రాయలసీమ ఐదుగురు రెడ్డి నేతల హస్తాల్లో ఇరుక్కుపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమ గురించి మర్చిపోవచ్చన్నారు. ఎర్రచందనం దుంగలు కొట్టే వారిని ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారని వారు గెలిస్తే ఏం చేస్తారన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది 2009 కాదని.. 2024 అని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని...కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామన్నారు. ప్రజా పోరాటాలకు రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు కానీ.. ఎన్నికలు వచ్చే సరికి వెనక్కి తగ్గుతారన్నారు.
సమావేశంలో తనకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసి వైసీపీలోకి వెళ్లిన కాపు నేతలపై సెటైర్లు వేశారు. అలా చేయాలి.. ఇలా చేయాలని లేఖాలు రాసిన వాళ్లు.. సలహాలు ఇచ్చిన వాళ్లు వైసీపీలో చేరిపోయారన్నారు. తనకు సీట్లు ఇవ్వడం.. తీసుకోవడం తెలియదా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడే వాళ్లు పద్దతిగా మాట్లాడాలనిసూచించారు. పవన్ కల్యాణ్ కు అదే పనిగా లేఖలు రాసిన హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. ముద్రగ కుటుంబం కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించుకుంది.
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ( MLA Arani Srinivas ) ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి జనసేన కండువా కప్పి పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆరణి శ్రీనివాస్ నేతృత్వంలో జనసేనలోకి చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు చేరారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో నేను ఎన్నో అవమానాలకు గురయ్యాను అని చెప్పుకొచ్చారు. నేను వైసీపీ బాధితుణ్ని.. బలిజ సామాజిక వర్గం నుంచి నేనొక్కడ్నే ఎమ్మెల్యేను.. కానీ నన్ను వైసీపీ అవమానించింది.. పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే తపిస్తారు.. పవన్ ఒక్కో మాట.. ఒక్కో తూటా.. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. పవన్ కళ్యాణ్ విధానాలు ఆకర్షించాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇవాళ్టి నుంచి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో నడుస్తా అంటూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ వెల్లడించారు. రాయలసీమలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను అని పిలుపునిచ్చారు.రాయలసీమలోనే కాదు.. గ్రేటర్ రాయలసీమలో నేను జనసైనికులతో ( Janasena party ) కలిసి నడుస్తా.. జనసైనికులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. పవన్ కోసం పార్టీ కోసం పని చేస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ నన్ను బావిలో దూకమంటే దూకడానికి కూడా సిద్దంగా ఉన్నాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ వెల్లడించారు.