ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి  రామకృష్ణ  అధికారిక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈ నెల 13 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ప్రవేశాలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల భద్రతను దష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. 


రిజిస్ట్రేషన్ ఫీజు..
ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని రామకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50, మిగతా వారు రూ.100 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మొదటి విడత ప్రవేశాలు పూర్తయ్యాక రెండో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 18002749868 నంబరును సంప్రదించవచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. 


దరఖాస్తు చేసుకోండిలా..



  • విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 

  • ఆన్ లైన్ అడ్మిషన్స్ 2021-22 (APOASIS) యూజర్ మాన్యువల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

  • ఇందులో టెన్త్ హాల్‌టికెట్‌ నంబర్, పాసైన సంవత్సరం, బోర్డు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్‌ నంబర్, ఈ-మెయిల్‌ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, చదివిన పాఠశాల, కులం, ఆధార్‌ కార్డు నంబర్ల తదితర వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

  • దరఖాస్తు పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌ వస్తాయి. వీటిని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి. 

  • అనంతరం దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు.. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

  • విద్యార్థి చిరునామా ఆధారంగా.. జిల్లాలు, కాలేజీలు, మాధ్యమాల వారీగా కాలేజీల వివరాలు కనిపిస్తాయి. 

  • వీటిలో నుంచి తమకు నచ్చిన కాలేజీలను ప్రాధాన్య క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 

  • ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఆయా కాలేజీలు విద్యార్థులకు సీట్లను కేటాయిస్తాయి. ఏ కాలేజీలో సీటు వచ్చిందనే వివరాలను విద్యార్థులకు మెసేజ్ రూపంలో తెలియజేస్తాయి.  


16 నుంచి సెకండియర్ తరగతులు..
ఏపీలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తరగతుల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కాలేజీలకు సూచనలు ఇచ్చారు. ఏపీలో పాఠశాలలు కూడా ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. 


Also Read: AP Schools Reopen Date: ఈ నెల 16 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం.. సాధారణ టైమింగ్స్‌లోనే..