Heavy Rains In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం పడింది. దీంతో భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం... తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్‌కు 480 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్‌లోని దీఘాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో కేద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. రేపు (శుక్రవారం) పశ్చిమ బెంగాల్ తీరం మోన్గ్లా ఖేపురా మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది.
వాయుగుండం ప్రభావంతో... ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. వాయుగుండం తీవ్రతతో తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
వాయుగుండం ప్రభావంతో... సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్ని చోట్ల తీర ప్రాంతాల్లో సముద్రం 50 అడుగుల నుంచి 100 అడుగుల వరకు ముందుకు వచ్చింది. దీంతో మత్స్యకారులను అప్రమత్తం చేశారు అధికారులు. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టలకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేసింది విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం.
మరోవైపు ఈనెల 20న అండమాన్ సముద్రం దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఈనెల 22 కల్లా వాయుగుండంగా మారుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈనెల 20నుంచి కోస్తాలో వర్షాలు కురవనున్నాయి. 20వ తేదీ నుంచి 21, 22 తేదీల్లో వర్షాల తీవ్ర పెరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక... భారీ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట దెబ్బతింటున్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది.