Amarnath Yatra : ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న యాత్రికుల్లో 20 మంది ఆదివారం సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. మరో 18 మంది యాత్రికులు సోమవారం రైలులో చండీగఢ్‌ నుంచి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ భవన్‌ అధికారులు తెలిపారు. అమర్‌నాథ్‌ అకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన యాత్రికుల్లో ఇంకా 34 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖకు సమాచారం అందింది. నెల్లూరు నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29 మందితో పాటు ఏలూరు నుంచి ఇద్దరు, తణుకు ఉండ్రాజవరం నుంచి ఒకరు, రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు మహిళల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Continues below advertisement


లభ్యం కానీ 34 మంది ఆచూకీ 


అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు వరదల తర్వాత అందకపోవడంతో రెవెన్యూ అధికారులు వారి చిరునామాలు, ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని చెప్పగా మరికొందరు విపత్తుకు ముందే తమ వారు వెళ్లిపోయారని తెలిపారు. అయితే ఇంకొందరు మాత్రం తమవారి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ వస్తున్నాయని ఆచూకీ దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 34 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులకు నిర్ధరణకు వచ్చారు.


ఇద్దరు మృతి 


అయితే అమర్నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం అయింది. బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన 12వ బ్యాచ్ పహల్ఘడ్ నుంచి బయలుదేరారు. వరదల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధ కుటుంబసభ్యులు శ్రీనగర్ ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె భర్త, అల్లుడు అక్కడే ఉన్నారని, వీలైనంత త్వరగా ఆమె మృత దేహాన్ని రాష్ట్రానికి తీసుకొస్తామని అధికారులు తెలియజేశారు. రాజమహేంద్రవరానికే చెందిన పార్వతి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని కుటుంబసభ్యులు అంటున్నారు. ఆమెను వెతకడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. 


యాత్రికుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 


నెల్లూరు జిల్లా నుంచి 82 మంది అమర్‌ నాథ్‌ యాత్రకు వెళ్లారని కలెక్టర్‌ వెల్లడించారు. వీరిలో 57 మంది సురక్షితంగా ఉండగా మరో 25 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ యాత్ర సందర్భంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో చాలా మంది గల్లంతయ్యారు.