Nara Lokesh Yuvagalam Postponed Due to Cyclone: రాష్ట్రంలో మిగ్ జాం తుపాను నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పాదయాత్రకు 3 రోజులు విరామం ఇవ్వనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కాకినాడ (Kakinada) జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు లోకేశ్ యువగళం పాదయాత్ర చేరింది. తుపాను ప్రభావంతో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను పూర్తిగా తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ శీలంవారిపాకల నుంచి 'యువగళం' ప్రారంభం కానుంది.
తుపాను పై చంద్రబాబు ఆందోళన
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు మిగ్ జాం తుపానుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. పటిష్ట చర్యల ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజలకు పునరావాసం, ఆహారం అందించేలా చూడాలని పేర్కొన్నారు.
చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ దూరంలో పుదుచ్చేరికి 200 కి.మీ దూరాన బాపట్లకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను వేగంగా దూసుకొస్తోంది. బాపట్ల దివిసీమ మధ్యలోనే మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మరోవైపు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Also Read: తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!