MLA Peddareddy Versus Jc Prabhakarreddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్ చల్ చేశారు. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్టర్లను మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారని ఆరోపిస్తూ ఆయన తన అనుచరులను వెంటబెట్టుకుని జేసీ ఇంటి వద్దకు ర్యాలీగా బయల్దేరారు. ఈ సమయంలో జేసీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుచరులు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. చివరకు డీఎస్పీ రంగయ్య సద్దిచెప్పడంతో పెద్దారెడ్డి వెనుదిరిగారు. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి వద్ద ఎమ్మెల్యేకు స్వాగతం పలకడానికి కుర్చీలు, టీ ఏర్పాటు చేసినట్లు టీడీపీ కార్యకర్తలు తెలిపారు.
'ఎన్నికల తర్వాత నీ సంగతి తేలుస్తా'
ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎన్నికల తర్వాత నీ సంగతి తేలుస్తా. అంతవరకూ జాగ్రత్త జేసీ. తాడిపత్రిలో మీ ఇంటిని కూల్చే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి.' అంటూ మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి జేసీ అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పేరు వస్తుందనే అక్కసుతోనే జేసీ కావాలనే పనులను అడ్డుకుంటున్నారని, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తన ఇంటి వద్దకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో ర్యాలీగా రావడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. 'పెద్దారెడ్డి ఎప్పుడూ కూడా నేను తాడిపత్రిలో లేని టైంలోనే నా ఇంటి వద్దకు వస్తున్నారు. మా ఇంటి వద్దకు వచ్చే వారికి టీ, స్నాక్స్ ఏర్పాటు చేశాను. సోమవారం తాడిపత్రి వెళ్లి పెద్దారెడ్డి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తా.' అని వ్యాఖ్యానించారు. కాగా, గతంలోనూ జేసీ, పెద్దారెడ్డి మధ్య వివాదాలు చెలరేగాయి. ఓసారి పెద్దారెడ్డి స్వయంగా జేసీ ఇంటికి వెళ్లగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: Foreign Direct Investments: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - తెలుగు రాష్ట్రాల స్థానమిదే