Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

Election Commission: డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఓటు మాత్రమే ఉండాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది.

Continues below advertisement

Election commission Action on Duplicate Votes in AP: రాష్ట్రంలో డబుల్ ఓట్, డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగుళూరులో ఓటు ఉన్న వారికి షాక్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓ వ్యక్తికి ఒకే రాష్ట్రం, ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలని తేల్చిచెప్పారు. 'ఓ వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓట్లు ఉండడం నిబంధనలకు విరుద్ధం. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు మాత్రమే నమోదు చేయాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ సైతం తీసుకోవాలి. వేరే ఎక్కడా తమకు ఓటు లేదని సదరు ఓటరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే కొత్త ఓటరుగా నమోదు చేయాలి. తప్పుడు డిక్లరేషన్, వివరాలు అందించిన వ్యక్తులపై కేసులు పెట్టాలి. అలాంటి వారిని జైలుకు పంపాలి.' అని సీఈవో స్పష్టం చేశారు. 20 ఏళ్లు పైబడిన వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలని సూచించారు. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. ఇళ్లు మారే వారు ఓటుకు పామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ సమర్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Continues below advertisement

వైసీపీ ఫిర్యాదుతో

వేరే రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వారికి ఇక్కడ కూడా ఓట్లు ఉన్నాయని, ఇది నిబంధనలకు విరుద్ధమని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం డూప్లికేట్, డబుల్ ఓట్లపై కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక ఓటరుకు ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండాలని స్పష్టం చేసింది.

ఈ నెల 9 లాస్ట్

రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొత్తగా ఓటరు నమోదు, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఓటు మార్పు, ఓటు హక్కు రద్దు చేసుకోవడం వంటి వాటికి ఈ నెల 9 వరకూ గడువు విధించారు. 2024, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీని కోసం ఫారం - 6 ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఓట్లు వేరే పోలింగ్ బూత్ పరిధిలో నమోదైతే వాటిని ఒకే పోలింగ్ పరిధిలోకి మార్చుకోవచ్చని ఈసీ అధికారులు తెలిపారు. ఫారం - 6A భారత పాస్ పోర్ట్ తో విదేశాల్లో ఉంటున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఫారం - 7 ద్వారా ఓటు తొలగించే అవకాశం ఉంటుంది. ఆఫ్ లైన్ లోనూ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా బూత్ లెవల్ ఆఫీసర్ వద్ద ఓటు నమోదు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఫైనల్ జాబితాను జనవరి 5న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈసీకి ఫిర్యాదులు

ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎన్నికల సంఘానికి అధికార, ప్రతిపక్షాలు వరుస ఫిర్యాదులు చేశాయి. ఫారం - 7 ఎక్కువగా వినియోగిస్తూ ఓటర్ అనుమతి లేకుండానే ఓట్లను తొలగిస్తున్నారని రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయి. తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఇక్కడ ఓటు వేయకుండా చూడాలని ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అటు, తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు సైతం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. తాజాగా, ఓటర్ల అవకతవకలపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీఈవోకు లేఖ రాశారు. దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఫిర్యాదులపైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. వీటి పరిష్కారం కోసం సీనియర్ ఐపీఎస్ అధికారులను జిల్లాల వారీగా పరిశీలకులుగా నియమించింది. వీరు జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితా రూపకల్పనపై అధికారులకు సూచనలు చేస్తూ, ఫిర్యాదులు వచ్చిన చోట స్వయంగా పరిశీలిస్తున్నారు.

ఈ నెల 9 (శనివారం)తో ఏపీలో ఓటరు నమోదు, మార్పులకు గడువు ముగియనుండగా, ఈ నెల 10 నుంచి కొత్త దరఖాస్తులను పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు, కొత్తగా ఓటు హక్కు కల్పించే ప్రక్రియను ఈ నెల 26లోగా పూర్తి చేయాలన్నారు. 2024, జనవరి 5న పూర్తి జాబితా ప్రకటించేలా సీఈవో చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ - ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వినతి

Continues below advertisement
Sponsored Links by Taboola