Andhra News :  ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల  క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ(ఆర్థిక శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.   సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను ఉపయోగించుకోవచ్చన్నారు.                  


మిలీనియం టవర్స్ ను సిఫార్సు చేసిన కమిటీ


ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని తెలిపారు. ఇక వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పెస్‌ను గుర్తించారు.


సీఎం క్యాంప్ ఆఫీస్ గా రుషికొండ భవనం


రుషికొండ రిసార్టు భవనాలే సీఎం క్యాంపు కార్యాలయానికి అనుకూలమైన ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా త్రిసభ్య కమిటీ సిఫార్సును తెరపైకి తెచ్చింది. విశాఖలో ముఖ్యమంత్రి, మంత్రుల క్యాంపు కార్యాలయాలు, అధికారులకు తాత్కాలిక వసతి కోసం భవనాల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు సీఎం జగన్‌ను కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి, కార్యదర్శుల కార్యకలాపాలకు, రుషికొండపై ఉన్న భవనాలు సరిపోతాయని,  పార్కింగ్‌, కార్యాలయం, వసతి, భద్రతా సిబ్బందికి ఇబ్బంది ఉండదని త్రిసభ్య కమిటీ సీఎంకు ఇచ్చిన నివేదికలో తెలియజేసింది.                           


కళింగ బ్లాక్‌లో సీఎంవో


సీఎం కుటుంబంతో ఉండేందుకు విజయనగర బ్లాక్‌ను  3,764 చ.మీ.లతో నిర్మాణం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే సముద్రం అందాలు ఆహ్లాదకరంగా కనిపించనున్నాయి. ఇందులోనే ప్రెసిడెన్షియల్‌ సూట్‌ గదులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కళింగ బ్లాక్‌ను సిద్ధం చేస్తున్నారు అధికారులు. 5,753 చ.మీ.లలో కళింగ బ్లాక్ నిర్మాణం చేపట్టినప్పటికీ, ఆ తర్వాత 7,266 చ.మీ.లకు పెంచారు. ప్రస్తుతం నిర్మిస్తున్న నాలుగు భవనాల్లో ఇదే పెద్దది.  1,821.12 చ.మీ.లలో వేంగి బ్లాకులను ఇప్పటికే సిద్ధం చేయగా, 690.40 చ.మీ.లలో నిర్మిస్తున్న గజపతి బ్లాక్‌ పనులు చివరి దశలో ఉన్నాయి.  ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్‌ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో హెలీ టూరిజం నిర్వహించిన సమయంలో హెలిప్యాడ్‌ నిర్మించారు. అక్కడి నుంచి నేరుగా రుషికొండకు చేరుకునేలా ఇప్పటికే ఒక మార్గాన్ని కొండ వెనుక నుంచి ఏర్పాటు చేస్తున్నారు.