Man Suicide Attempt in Front of Police Station in Tirupathi: తిరుపతి (Tirupati) జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ (Chandragiri Police Station) వద్ద సోమవారం ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. తన భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తనకు న్యాయం చేయాలని కేకలు వేశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే మంటలు ఆర్పేందుకు యత్నించారు. 80 శాతానికి పైగా కాలిపోవడంతో బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు విజయవాడకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. కొంచెం ఉంటే పోలీస్ స్టేషనే తగలబడేదని స్థానికులు అంటున్నారు.


ఇదీ జరిగింది


విజయవాడకు చెందిన మణికంఠ, తమిళనాడులోని తిరుత్తణికి చెందిన దుర్గని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె, అభయ్ (5) అనే పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. 3 నెలలు క్రితం భర్తతో విభేదించిన దుర్గ తిరుపతి చేరుకుంది. అక్కడ సోనూ అలియాస్ బాషాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సహజీవనం చేస్తున్న వారిద్దరూ.. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే పగడాల శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో మకాం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త మణికంఠ, చంద్రగిరి పీఎస్‌కు చేరుకుని కానిస్టేబుల్ ను నిలదీశాడు. అయితే, తన భార్యను వదిలేసి వెళ్లిపోవాలని.. లేకుంటే దొంగతనం కేసు పెట్టి జైల్లో పెట్టిస్తానని కానిస్టేబుల్ బెదిరిస్తున్నాడని ఆరోపించాడు. దీంతో మనస్తాపం చెందిన మణికంఠ, పీఎస్ పక్కనే ఉన్న బంక్ నుంచి 5 లీటర్ల పెట్రోల్‌ తీసుకొచ్చి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలతో అలాగే స్టేషన్‌లోకి వెళ్లి ఆర్తనాదాలు చేశాడు. పోలీసులు, స్థానికులు ఆ మంటలను ఆర్పారు. 108 అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో పశు వైద్య సంచార వాహనంలో మణికంఠను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: Visakha Fishing Harbor Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి - విచారణకు ఆదేశం, యూట్యూబర్ కోసం గాలిస్తున్న పోలీసులు