Andhra News : ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ F;d;fxof. ఇప్పటి వరకూ ఏపీలో ఉద్యోగుల బదిలీ నిషేధం ఉంది. ఇప్పుడు సడలించారు. ఈ నెల 22 నుంచి 31 మధ్య ఏపీ ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో బదిలీలకు అవకాశం కల్పించారు. బదిలీలకు గైడ్ లైన్స్ విడుదల చేసిన ఏపీ సర్కార్.. అందులో కీలక నిబంధనలు పెట్టింది. 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసినవాళ్లకు రిక్వెస్ట్‌పై బదిలీకి అవకాశం కల్పిస్తారు. ఐదేళ్లు ఒకె చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరిగా ఉంటుంది. 2023 ఏప్రిల్ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకన్నవాళ్లు అందరూ బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. టీచర్ల తో పాటు పలు ఇతర ఉద్యోగులకు విడిగా గైడ్ లైన్స్ జారీ చేసింది ప్రభుత్వం.
గత ఏడాది జూన్‌లో ఓ సారి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగుల సాధారణ బదిలీల కోసం కొంత కాలం పాటు నిషేధాన్ని సడలించారు. గత ఏడాది కూడా ఐదేళ్ల పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది. వ్యక్తిగత వినతులు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా కూడా బదిలీల ప్రక్రియ నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఎత్తివేయలేదు. 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఏత్తి వేసి పూర్తి స్థాయి బదిలీలకు అవకాశం కల్పించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బదిలీల ప్రక్రియపై మళ్లీ నిషేధం జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలపై స్పష్టత లేదు. చాలా కాలంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కోరుకుంటున్నారు. ప్రొబేషన్ డిక్లయిర్ కాగానే బదిలీలు ఉంటాయని ఆశించిన ఉద్యోగుల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనబడటం లేదని చెబుతున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఏ జిల్లాలో ఉద్యోగం దొరికితే ఆ జిల్లాకు వెళ్లామని, కుటుంబం, భార్యా బిడ్డలు ఒకచోట తాము ఒకచోట ఉంటున్నామని, ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి దూరమయ్యా మని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి కూడా గురవు తున్నట్లు పలువురు చెబుతున్నారు. అలాగే ఇఎస్‌ఐ అమల్లోకి రాకపోవడం గ్రామ సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇకనైనా తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని బదిలీల ప్రక్రియ చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రభత్వం ఎప్పటికప్పుడు సానుకూలత వ్యక్తం చేస్తోంది కూడా ఉత్తర్వులు ఇవ్వడం లేదు. ప్రస్తుతం జారీ చేసిన ఉద్యోగుల బదిలీల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల గురించి చెప్పకపోడవంతో వారు నిరాశకు గురవుతున్నారు.