Andhra Common people problems not being solved: ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరిగేది..తమకు చిన్న సమస్య వచ్చినా సరే స్పందించే యంత్రాంగం ఉన్నప్పుడే. ప్రతిదానికి అర్జీ పట్టుకుని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ.. పార్టీ కార్యాలయాలు చుట్టూ తిరిగితే వ్యవస్థ విఫలమైనట్లే అవుతుంది. ఇటీవల పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ గ్రీవెన్స్ నిర్వహించారు. నాలుగైదు వేల మంది తరలి వచ్చారు. ఇది పాజిటివ్ కాదు.. నెగెటివ్. ఎందుకంటే ఆయనను కలిసి సమస్యలను చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. అన్ని సమస్యలూ అంత స్థాయిలో పరిష్కరించాల్సినవి కాదు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు పరిష్కరించాల్సినవే. అయినా వారు పట్టించుకోకపోవడంతోనే లోకేష్ వరకూ వచ్చారు.
గ్రీవెన్స్ పరిష్కారం అత్యంత ముఖ్యం
నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తరవాత మంగళగిరి ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు.అక్కడికి ఇతర ప్రాంతాల వారు కూడా వచ్చి సమస్యలు చెప్పుకునేవారు. వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు లోకేష్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నారు. కానీ ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి? ప్రజలు లేదా కార్యకర్తలు ప్రతి సమస్యకు పై స్థాయి వరకూ రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చారంటే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు కావాల్సిన ఓ ఎకోసిస్టమ్ ఏర్పాటు కాకపోవడమో.. సరిగ్గా పని చేయడమో జరుగుతోందని అర్థం. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నవారు అన్ని సమస్యల్నీ పట్టించుకోలేరు. ఆ స్థాయి దాకా రావాలంటే ఆ సమస్య అంత పెద్దది అయి ఉండాలి. కానీ లోకేష్ కు చెప్పుకునేందుకు వచ్చిన వారి సమస్యలు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం అయ్యేవే. పోలీసులు, అధికారులతో సమన్వయం చేస్తే అయిపోతాయి.
నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం అయ్యేలా చూడటం ముఖ్యం
సమస్యలు చెప్పుకునేందుకు సాయం కోసం.. కోసం వచ్చే వారికి ఎక్కువ శ్రమ లేకుండా మొదటి అంచెలోనే పరిష్కారం దొరకడం చాలా ముఖ్యం. పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కోసం వచ్చిన వారిని చూసి నారా లోకేష్ కూడా ఆశ్చర్యపోయారు. సమస్య తీవ్రతను బట్టి ఎస్కలేట్ చేయవచ్చు కానీ.. చిన్న చిన్న సమస్యలకూ పై స్థాయి వరకూ వస్తున్నారంటే.. కింది స్థాయిలో ఎవరూ సరిగ్గా పట్టించుకోవడంలేదని నారాలోకేష్ కు అర్థమైపోయింది. అందుకే ఎమ్మెల్యేలపై ఆయన సీరియస్ అయ్యారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పెడసరంగా ఉంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. చివరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పంపిణీ చేయడం లేదు. ఎంతో కష్టంలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తే ఇవ్వడానికి కూడా తీరిక లేనతంగా ఎమ్మెల్యేలు ఉంటున్నారంటే చిన్న విషయం కాదని భావిస్తున్నారు. అందుకే లోకేష్, చంద్రబాబు ఎమ్మెల్యేలకు టైం టేబుల్ ఇచ్చారు.
చెబుతున్న మాటలకు .. చేతలకు పొంతన లేదు! TDP ప్రభుత్వం గ్రీవెన్స్ పరిష్కారానికి మల్టీ-లెవల్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లుగా చెబుతోంది. "ప్రజా వేదిక" ప్రతి వారం జరగాలని చంద్రబాబు చెబుతున్నారు. మంత్రులు, MLAs, జిల్లా కలెక్టర్లు ప్రజావేదిక నిర్వహిస్తున్నారు. PGRS పోర్టల్‌లో రోజువారీ 1,000+ ఫిర్యాదులు రిజిస్టర్ అవుతున్నాయని అధికారవర్గాలుచెబుతున్నాయి.కానీ వాటి పరిష్కారం గురించేస్పష్టత లేదు. అందుకే టీడీపీ నాయకత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది. ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్స్ మీటింగ్‌లు తప్పనిసరి అని ఆదేశాలుజారీ చేశారు. PGRS పోర్టల్ ో ఆన్‌లైన్ ఫిర్యాదులు రిజిస్టర్, ట్రాకింగ్. భూమి, విద్యుత్, పెన్షన్ సమస్యలు ప్రధానంగా వస్తున్నాయి. యాప్ ద్వారా కంప్లైంట్లు. మంత్రులు, కలెక్టర్లు స్పందించాలని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వీక్లీ పబ్లిక్ ఇంటరాక్షన్. మంత్రులు, MLAsకు మూడు-లెవల్ గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ సమర్థంగా పనిచేస్తే సమస్య ఉండదు. కానీ అలాంటి పరిస్థితి ఉండకపోవడమే సమస్య.
ఎన్ని గొప్ప పనులు అయినా చేయవచ్చు కానీ.. ప్రభుత్వం తరపున పరిష్కరించగలిగే చిన్న సమస్యలను సామాన్యుడికి పరిష్కరించకపోతే వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వాలు ఇలాంటి చిన్న సమస్యలనే సీరియస్ గా తీసుకుని స్పందించాలి. అప్పుడే ప్రభుత్వం మన కోసం ఉందన్నభావనకు సామాన్యుడు వస్తాడు. ఈ విషయం రాజకీయ నేతలు మర్చిపోవడం వల్లనే వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది .