Anantapur News: అనంతపురం అర్బన్ వైసీపీ టికెట్ పై రోజు రోజుకి పోటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసిపి టికెట్ కు ఎవరూ పోటీలో లేరనుకున్నారు. కానీ ఒక్కరోజులో సీన్ మారిపోయింది. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్బంగా ఆశావహులు తామే టికెట్ రేసులో ఉన్నామని చెప్పకనే చెప్పేశారు. దీంతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వేంకటరామి రెడ్డికి కలవరం మొదలైంది. ఇంతకీ ఎవరు ఆ వ్యాఖ్యలు చేశారంటే..


ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో అనంతపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాని నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు హడావుడితో అనంతపురం జిల్లా కేంద్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగింది. ఆయన పై ఎలాంటి వ్యతిరేకతలు లేవు. నిన్నటి వరకు సైలెంట్ గా కనిపించిన రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన ఇద్దరు నేతలు తెరపైకి రావడం ఒక్కసారిగా రాజకీయాల్ని వేడెక్కించాయి. సీఎం జగన్ జన్మదిన వేడుకలను వారు వేదికగా చేసుకొని బల ప్రదర్శనకు దిగారు. వారిలో ఒకరు అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ మరొకరు ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్.


ఈ ఇద్దరు నాయకులు ఒకప్పుడు తెలుగుదేశం నేతలు. తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ప్రయత్నించి నిరాశపడి చేసేది లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జిగా చాలా రోజులపాటు పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతపురం చోటు చేసుకున్న పరినామాలతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహాలక్ష్మి శ్రీనివాస్ పోటీ చేశారు. అ ఎన్నికల్లో తన ప్రత్యర్థి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గెలుపొందాడు. 2014 ఎన్నికలకు ఆయన పూర్తిస్థాయిలో సిద్ధమైన తరుణంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టీడీపీ టికెట్ వచ్చింది. దీంతో మనస్థాపంతో మహాలక్ష్మి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 వరకు ఆయన పార్టీ కోసం ఎంతో చేశారు. కానీ 2019 ఎన్నికల్లో దాదాపు టికెట్ వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ చివరి క్షణంలో ఆ టికెట్ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి వచ్చింది. 


దీంతో నిరుత్సహపడకుండా కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ రేసులో నిలిచారు. కానీ ఆ పదవి మరొకరికి పోయింది. దీంతో అసంతృప్తిగా ఉన్న మహాలక్ష్మి శ్రీనివాస్ కు అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) చైర్మన్ గా అవకాశం కల్పించారు. రెండేళ్ల  తర్వాత కూడా ఆయనకు ఆ పదవిని కొనసాగించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా నగరంలో కనివిని ఎరుగని రీతిలో ఫ్లెక్సీలు, హోర్గింగులతో హోరెత్తించారు. వందలాది మంది యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఒక భారీ కటౌట్ కు క్రేన్ సాయంతో పాలాభిషేకం చేసి జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఇదంతా చేస్తున్నది ఆయన టికెట్ కోసమేనని అంతా భావిస్తున్నారు.


మరోవైపు ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీం విషయంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. కానీ టిడిపి లో ఉండలెక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. 2014, 19 ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ కోసం ట్రై చేశారు. అయితే నదీమ్ సేవలను గుర్తించిన సీఎం జగన్ ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా అవకాశమిచ్చారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా నధీమ్ కూడా నగరంలో భారీ హోర్డింగులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు నేతలు టికెట్ రేసులో ఉన్న కారణంగానే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. 


అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు మైనార్టీలవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కోటాలో టికెట్ సాధించాలని నదీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారుగా 60 వేల ఓట్లకు పైగా  మైనార్టీలవి ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మైనారిటీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. అందుకే నదీం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మహాలక్ష్మి శ్రీనివాస్ కూడా సామాజిక వర్గ ఈక్వేషన్స్ తోనే తెరపైకి వచ్చారు. మైనారిటీల తర్వాత అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. సుమారుగా 45 వేల ఓట్ల వరకు వీరివి ఉన్నాయి. నేపథ్యంలో ఈసారి కచ్చితంగా బలిజలకే టికెట్ ఇస్తారన్న ప్రచారం రెండు పార్టీల్లోనూ ఉంది. అందుకే మహాలక్ష్మి శ్రీనివాస్ చివరి నిమిషంలో తెరపైకి వచ్చారు.


జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వేదికగా చేసుకొని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వర్గీయులు కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఎక్కడా ఈ విధంగా ఫ్లెక్సీలు ఓటింగ్ లు జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయలేదు. కానీ టికెట్ రేసులో ఉన్న ఈ ఇద్దరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.