రానున్న ఎన్నికల అనంతరం అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన తన ప్రత్యర్థులను వదిలిపెట్టబోనని తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా జేసీ కుటుంబంపై ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం మూడు నాలుగు మాసాల తర్వాత తన ప్రత్యర్థులను ఎంచుకొని మరి ఏరివేస్తామన్నారు. పంటకు పట్టిన చీడపురుగుల్లాగా రాజకీయాలకు పట్టిన చీడపురుగులను ఏరేస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. నా సహనాన్ని.. నా ఓర్పుని చేతగానితనంగా తీసుకుంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. కచ్చితంగా గతంలో పెద్దారెడ్డి ఎలా ఉండేవాడో అలాంటి పెద్దారెడ్డిని మరోసారి తాడపత్రి ప్రజలు చూడబోతున్నారని తెలియజేశారు. గతంలోలాగా ఫ్యాక్షన్ లేకుండా ఉండేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానని.. అందుకు తననే చేతగాని వాడిలా చిత్రీకరిస్తుంటే సహించే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల అనంతరం పాత పెద్దారెడ్డిని చూపిస్తానని పరోక్షంగా జేసీ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చాడు. 


తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడిప్పుడే ఫ్యాక్షన్ కోరల నుంచి బయటపడుతున్న గ్రామాల్లో మరొకసారి ఫ్యాక్షన్ కు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ వ్యాఖ్యలతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని ప్రజలు.. జిల్లా పోలీసు యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


పరోక్షంగా జేసీ కుటుంబాన్ని ఉద్దేశించే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల కిందట ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ తాడిపత్రి పట్టణంలో కరపత్రాల కలకలం సృష్టించాయి. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక, భూములు దోపిడీ చేశారని ఈ కరపత్రాలు ముద్రించి నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తు తెలియని వ్యక్తులు పంచారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ వైరం కాస్తా ఫ్యాక్షన్ వైపు నడుస్తుందని కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.