Hyderabad Car Fire Accident News Today: హైదరాబాద్: నగరంలోని మింట్ కాంపౌండ్ లో రోడ్డుపై వెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కార్ లో మంటలు (BMW Car catches fire) చెలరేగాయి. మంటల్ని గమనించిన డ్రైవర్ వెంటనే కారు నిలిపివేసి బయటకు వచ్చేశాడు. కొంత సమయానికే బీఎండబ్ల్యూ కారు మంటల్లో దగ్దమైంది. నిమిషాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించడంతో వాహనం కాలిపోయింది. అయితే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో వాహనం ఎక్కడ పేలిపోతుందోనని అటుగా వెళ్తున్న వారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీహెచ్ ఎంసీ (GHMC) వాటర్ ట్యాంకర్, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే వాహనం దగ్ధమైపోయింది.
కారు నడుపుతున్న బయటకు రావడంతో అతడికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు మింట్ కాంపౌండ్ వద్దకు చేరుకుని మంటల్లో కాలిపోయిన కారును పరిశీలిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో ఇంజిన్ మరింత వేడెక్కిన సందర్భాలలో బైక్స్, కార్లలో మంటలు చెలరేగడం తెలిసిందే. కానీ ఈ మధ్య శీతాకాలంలో వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. అపార్ట్ మెంట్లు, ఇళ్లోనూ అగ్ని ప్రమాద ఘటనలు హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో అధికమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.