Anantapur News: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జల రాజకీయాలు చేస్తున్నారని నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. తాము రైతులకు నీరు విడుదల చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. పయ్యావుల కేశవ్ మాత్రం ధర్నాల పేరుతో హడావుడి చేస్తున్నారని అన్నారు. పయ్యావుల కేశవ్ డబుల్ గేమ్ ఆపాలని డిమాండ్ చేశారు. మంగళవారం (డిసెంబర్ 19) ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి పయ్యావుల దీక్ష గురించి మాట్లాడారు.


గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద 30 వేల ఎకరాల్లో పంటల సాగు అవుతుంది. పంటలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు? నాలుగు రోజులుగా నీరు విడిచేందుకు టీడీపీ సర్పంచ్, ఇతర నాయకులను వైస్సార్సీపీ నేతలు ప్రాధేయపడ్డారు. వారం నీరు వదిలితే 30 వేల ఎకరాల్లో పంట చేతికొస్తుంది. సరిగ్గా నీరు విడుదల చేసే సమయంలో పయ్యావుల కేశవ్ రాస్తారోకో, ధర్నా అంటూ రైతులను రెచ్చగొట్టి నీరు రాకుండా చేశాడు, రైతుల పొట్ట కొడుతున్నాడు. నీటి విడుదల కాకుండా వ్యాసపురం, నింబగల్లు వాళ్ళని రెచ్చగొట్టింది పయ్యావుల కేశవ్. రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా. 


ప్రభుత్వం ద్వారా తుంగభద్ర బోర్డు అధికారులతో మాట్లాడి అదనంగా ఒక టీఎంసీ కూడా తెచ్చాం. హంద్రీనీవా ద్వారా సరాసరి రావాల్సిన నీరు 40 టీఎంసీలు కాగా ఈ సారి వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు కేవలం 17 టీఎంసీలు వచ్చాయి. అందులో కర్నూలు జిల్లా 2.5 టీఎంసీలు,అనంతపురం జిల్లా 10.417, కడప 00..టీఎంసీలు వాడుకోగా చిత్తూరు జిల్లా కేవలం 0.5 శాతమే తీసుకున్నారు. కేశవ్ కు అవగాహన లేకే మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొడుతున్నారు’’ అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.


మధ్యాహ్నం పయ్యావుల ఆందోళణ - అరెస్టు
అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌ కింద పంటలు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులతో కలిసి ఆయన ఆందోళనకు దిగినందుకు పోలీసులు ఆరెస్టు చేశారు. అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు గుంతకల్లు బ్రాంచి కెనాల్‌ ఆయకట్టు రైతులతో పయ్యావుల కేశవ్ సమావేశం అయ్యారు. రైతులతో కలిసి రోడ్డుపై కూర్చొని ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఉరవకొండ సమీపంలోనే హంద్రీనీవా కెనాల్ వద్ద బళ్లారి - అనంతపురం హైవేపై రైతులతో కలిసి కూర్చొని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జనసేన నేతలు, వామపక్ష పార్టీల నేతలు ఆందోళన చేశారు.


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకి హంద్రీనీవా నీటిని తీసుకెళ్ళేందుకు తాపత్రయపడుతున్నాడే తప్ప ఉరవకొండ రైతులకు మాత్రం నీటిని ఇవ్వడం లేదని విమర్శించారు. వేల ఎకరాల్లో పంటలు సాగు చేసిన గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతులకు హంద్రీనీవా నుంచి నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉందని, అయినా కేవలం తన స్వప్రయోజనాల కోసమే మంత్రి పెద్దిరెడ్డి హంద్రీనీవా నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రెండు రోజులలోగా సమస్యలను పరిష్కారం చేయకపోతే తామే హంద్రీనీవా నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కి నీటిని విడుదల చేస్తామని విమర్శించారు.