Anantapur News : అనంతపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తనదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై స్పందించిన ఆయన... జనసేనతో గతంలో పొత్తు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అధికారపార్టీని ఓడించే ప్రయత్నం చేస్తానన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా అనేక వ్యూహాలున్నాయని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆ వ్యూహంలో భాగంగా ఆదివారం పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారని తెలిపారు. పవన్ కల్యాణ్ ఒకటే చెబుతున్నారని, ఈసారి వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతిపాలవుతుందని ఆయన చెబుతున్నారన్నారు.  గతంలో కూడా జనసేన పార్టీ టీడీపీతో పొత్తులో ఉందన్నారు. సిద్ధాంతాల పరంగా జనసేన విరోధి పార్టీ కాదన్నారు. టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటిచేస్తే తన భుజాల మీద వేసుకుని మంచి మెజారిటీతో పవన్ గెలిపిస్తానన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే ఒకవేళ పవన్ కల్యాణ్ కాకుండా అనంతపురం నుంచి జనసేన పార్టీ తరుపున ఎవరికి టికెట్ ఇచ్చినా పొత్తులో భాగంగా సపోర్టు చేస్తామన్నారు. 


వైసీపీ ఓడిపోవాలి అదే మా లక్ష్యం


"పవన్ ఇప్పటికే ఆయన వైఖరి స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చేయాలనే వ్యూహంలో భాగంగానే పవన్, చంద్రబాబు భేటీ జరిగి ఉండొచ్చు. పవన్ ఒక్కటే చెబుతున్నారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతిపాలు అవుతుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తే ఆయన్ను భుజంపై వేసుకుని గెలిపించే బాధ్యత నాది.  నేను నా టికెట్ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అనంతపురం హెడ్ క్వార్టర్స్ లో వైసీపీ ఓడిపోవాలి." - ప్రభాకర్ చౌదరి  


చీకటి జీవోపై పోరాడతాం - చంద్రబాబు 


 హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం కలిశారు. కుప్పంలో ఇటీవల జరిగిన సంఘటనలపై చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం ఇరువురు ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సభ పెట్టుకునేందుకు ఎక్కడా సభ ఇవ్వనంటే ఇప్పటం గ్రామంలో రైతులు ముందుకొచ్చి సభకు భూములిచ్చారని చంద్రబాబు తెలిపారు. అందుకు వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి ఇప్పటం గ్రామస్థుల ఇళ్లు కూల్చేశారని ఆరోపించారు. అనంతరం పవన్ పరామర్శించేందుకు వెళ్తే వాహనాలను అనుమతించలేదు. పైగా రోడ్డు వెడల్పు చేయడానికి ఇళ్లు పడగొట్టామని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఆత్మకూరులో వందల కుటుంబాలను బహిష్కరిస్తే వాళ్లను పరామర్శించేందుకు వెళ్తే తన ఇంటి గేటు తాళ్లు కట్టి వెళ్లనీయకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. 


రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం 


"విశాఖపట్నం వెళ్తే అక్కడ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు లా అండ్ ప్రొబ్లమ్స్ వచ్చేస్తున్నాయని తిరిగి పంపించేశారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నామినేషన్లను అడ్డుకుంటున్నారని వాళ్లకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తే అక్కడ నన్ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తే నాపై రాళ్లతో, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. అప్పుడు డీజీపీ...ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇంటి వద్ద ఉంటే వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి జోగి రమేష్ నా ఇంటిపైకి కర్రలతో దాడికి వచ్చారు. పైగా నాకు రిప్రజంటేషన్ ఇచ్చేందుకు వచ్చారని పోలీసులు అన్నారు. గంజాయి, డ్రగ్స్ పై పోరాటం చేస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు.  నా ఆఫీసుపై దాడి చేసి కనీసం వారిపై కేసు కూడా పెట్టలేదు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. రాజకీయ పార్టీలకు నిర్థిష్టమైన ఆలోచన ఉంటాయి. వైసీపీ మాత్రం దాడులు చేయడం, ఎవరైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్లపై దాడులు చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాయి." - చంద్రబాబు