Hardik on Suryakumar Yadav: శ్రీలంకతో టీ20 సిరీస్ ను టీమిండియా 2-1తో గెలుచుకుంది. శనివారం జరిగిన మ్యాచ్ లో 91 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసి ట్రోఫీని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టిగా రాణించిన భారత్ సునాయాస విజయం సాధించింది. ముఖ్యంగా సూర్యకుమార్య యాదవ్ తన బ్యాటింగ్ తో లంక నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు. 


శనివారం లంకతో టీ20 మ్యాచ్ లో మిస్టర్ 360 సూర్యకుమార్య యాదవ్ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఎందుకు ప్రపంచంలోనే నెంబర్ 1 టీ20 బ్యాటర్ గా ఉన్నాడో చూపిస్తూ.. విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఔరా అనిపించాడు. బంతి ఎక్కడ వేసినా బాదడమే పనిగా పెట్టుకున్న సూర్య.. శ్రీలంకకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్ లో 9 సిక్సులు ఉన్నాయంటేనే అతని హిట్టింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సూర్య తుఫాన్ ఇన్నింగ్స్ తో భారత్ 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. 


అతను జట్టులో ఉంటే కెప్టెన్ పని తేలికవుతుంది


రాజ్ కోట్ లో పరుగుల సునామీ సృష్టించిన సూర్యకుమార్ యాదవ్ పై కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రశంసలు కురిపించాడు. నిన్న మ్యాచ్ శ్రీలంకకు- సూర్యకు మధ్య జరిగినట్లు అనిపించిందని అన్నాడు. 'సూర్య లాంటి వాళ్లు జట్టులో ఉంటే కెప్టెన్ పని తేలికవుతుందని హార్దిక్ అన్నాడు. సూర్యకుమార్ లాంటి వాళ్లు మన జట్టులో ఉండడం చాలా ముఖ్యం అని నేను ఎప్పుడూ చెప్పేది ఇందుకే. అతను ఆటతీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అతను ఎప్పుడూ ఒకే మాట చెప్తుంటాడు. బ్యాటింగ్ తేలికగా ఉంది అని. నేనే కనుక ప్రత్యర్థి బౌలర్ ని అయితే సూర్య బ్యాటింగ్ కు బాధపడేవాణ్ని. అతను షాట్లు ఆడే విధానం బౌలర్ ను విచ్ఛిన్నం  చేస్తుంది.' అని సూర్యపై పాండ్య ప్రశంసల వర్షం కురిపించాడు.


సూర్యకు ఏం చెప్పాల్సిన అవసరంలేదు 


బ్యాటింగ్ కు వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూమ్ లో సూర్యకు ఏం చెప్తారు అన్న ప్రశ్నకు హార్దిక్ పాండ్య ఇలా స్పందించాడు. 'సూర్య లాంటి ఆటగాళ్లకు సూచనలు ఇవ్వాల్సిన అవసరంలేదు. అతనికి స్ఫష్టత ఉంది. తన ప్రణాళికల గురించి ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా ఉంటాడు. ఈ ఫార్మాట్ లో తన విజయానికి ఇదే కారణం. సూర్య తన సామర్థ్యంపై అనుమానాలు పెట్టుకోడు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే దాని గురించి మేం మాట్లాడుకుంటాం.' అని పాండ్య వివరించాడు. అలాగే నిన్న రాహుల్ త్రిపాఠి కూడా సూపర్ గా బ్యాటింగ్ చేశాడని పాండ్య అభినందించాడు.