Paritala Sunitha : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‍రెడ్డి(Topudurthi Prakash Reddy)పై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాములయ్య(Sriramulayya Movie) సినిమా షూటింగ్‍లో కారు బాంబు పెట్టించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 26 మందిని పొట్టన పెట్టుకోవడంలో ప్రకాష్‍రెడ్డి కూడా భాగస్తుడే ఆరోపించారు. మా చరిత్ర కాదు.. ప్రకాష్‍రెడ్డి తన చరిత్ర తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్‍రెడ్డి అవినీతిపై సినిమా తీసేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. ప్రకాష్‍రెడ్డి ఇంట్లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. తమ కుటుంబాన్ని విమర్శించడం కాదని, ప్రాజెక్టులు పూర్తి చేసి చూపించాలని సవాల్ చేశారు. పరిటాల రవి(Paritala Ravi) గురించి మాట్లాడితే సహించేది లేదని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. 







పరిటాల రవి కాలి గోటికి సరిపోవు!


పరిటాల కుటుంబం గురించి విమర్శించడమే రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని టీడీపీ(Tdp) ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్(Paritala Sriram) ఘాటుగా విమర్శించారు. మాజీ మంత్రి పరిటాల రవి కాలి గోటికి కూడా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సరిపోడని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన గౌరవ సభకు టీడీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వచ్చారు. కనగానపల్లి గ్రామం పసుపుమయంతో నిండిపోయింది. ఏదైనా సమస్య ఉంటే తనతో మాట్లాడాలని ఎప్పుడో 18 ఏళ్ల క్రితం చనిపోయిన పరిటాల రవి గురించి మాట్లాడటం ఏమిటని నిలదీశారు. 


ప్రతి మద్యం బాటిల్ పై సీఎంకు రూ.10 కమీషన్ 


తోపుదుర్తి కుటుంబం ఎలాంటి రక్త చరిత్ర సృష్టించిందో ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదని పరిటాల శ్రీరామ్ అన్నారు. కారుబాంబు కేసులో మీ హస్తం లేదా అని ప్రశ్నించారు. మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కల్తీ మద్యం తాగి చనిపోయారని అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ టీ బ్రేక్ ఇస్తున్నారని విమర్శించారు. ప్రతి మద్యం బాటిల్ మీద సీఎం జగన్(CM Jagana) కు 10 రూపాయల వరకు కమిషన్ వెళ్తోందని శ్రీరామ్ ఆరోపించారు. సామాన్య ప్రజలతో పాటు అన్ని వర్గాలు వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారన్నారు. కొందరు స్థానిక నాయకులు విర్రవీగి మాట్లాడుతున్నారని వారందరూ త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.