Hyderabad News : హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్(Specail Drive) చేపట్టారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్(Black Film), పోలీస్(Police), ప్రెస్(Press), ఆర్మీ(Army), ఎమ్మెల్యే(Mla), ఎంపీ(MP), ఇతర స్టిక్కర్ల(Stickers) దుర్వినియోగంపై తనిఖీలు చేస్తున్నారు. రెండు వారాల పాటు ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకూ పోలీసు, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యేల పేరిట అనధికార స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు వదిలేసేవారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ పోలీసుల్లో కదలిక వచ్చింది. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ వాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జడ్‌ప్లస్ కేటగిరి(Z+ Catogery) ఉన్న వారు తప్ప ఇతరులు ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించవద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ వాడకూడదని తెలిపారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ పెట్టకూడదన్నారు.
సంబంధిత పత్రాలు, గుర్తింపు కార్డు తప్పనిసరి
డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల పేపర్లు లేకుండా బైక్‌లకు పోలీస్, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యే, జీహెచ్‌ఎంసీ, డాక్టర్, ఇతర స్టిక్కర్లు స్టిక్కర్లు పెట్టుకొని రోడ్లపైకి వచ్చే నకిలీగాళ్లకు ట్రాఫిక్ పోలీసులు చెక్ పెడుతున్నారు. ఇలాంటి వాహనాలు హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కనిపించినా ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ప్రముఖ వ్యక్తుల పేర్లతో విచ్చలవిడిగా వాహనాలపై తిరిగే వాళ్లకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజా నిర్ణయం తీసుకున్నారు. వాహనంపై స్టిక్కర్ అంటించుకుంటే దానికి సంబంధించిన పత్రాలు, గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలని పోలీసులు సూచించారు. ఒకవేళ సంబంధిత పత్రాలు చూపించని పక్షంలో అలాంటి వాహనాల్ని సీజ్(Vehicle seize) చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జూబ్లీహిల్స్ కారు ప్రమాదంతో తనిఖీలు ముమ్మరం
జూబ్లీహిల్స్ కారు ప్రమాదం తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నకిలీ స్టిక్కర్లు(Fake Stickers) పెట్టుకుని బైక్‌లు, కార్లలో తిరుగుతున్న వారిపై వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు చూపించని వాహనదారులపై సీఎంవీ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టడానికి ప్రధాన కారణం జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం. కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో పెద్ద దుమారం రేగింది. దీనిపై స్వయంగా ఎమ్మెల్యే మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ ఘటనతో శనివారం నుంచి నగరంలో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.