TTD Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు(Arjitha Seva Tickets) విడుదల అయ్యాయి. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తారు. అధికారిక వెబ్‌ సైట్‌లో సేవా టికెట్లు కొనుగోలు చేయాలని టీటీడీ(TTD) భక్తులకు సూచించింది. శ్రీవారి దర్శనానికి(Srivari Darshan) వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. 


టీటీడీ కీలక నిర్ణయం 


కోవిడ్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో గత పాలక మండలి సమావేశంలో ఆర్జిత సేవల పునఃప్రారంభించేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలపడంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లకు భక్తులను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టద‌ళ‌పాద‌ ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లను శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. అయితే కోవిడ్‌ పరిస్ధితుల విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగించనుంది టీటీడీ. అదేవిధంగా క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్ర దీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా యథావిధిగా‌ కొన‌సాగించనుంది.  అయితే వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదని స్పష్టం చేసింది. వర్చువల్ ఆర్జిత సేవల బుక్ చేసుకున్న భక్తుల ద‌ర్శనం క‌ల్పించ‌డంతో పాటు ప్రసాదాలు మాత్రమే అందించనుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్తమాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమతిస్తున్నారు. 


ఏప్రిల్ ఒకటి నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం


ఏప్రిల్ ఒకటో తేదీ నుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి(AV Dharma Reddy) ఇటీవల ప్రకటించారు. క‌రోనా మహమ్మారికి ముందు ఆర్జిత సేవా టికెట్ల జారీ విధానం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంద‌న్నారు. ఆన్‌లైన్, ల‌క్కీడిప్‌, సిఫార‌సు లేఖ‌ల‌పై టికెట్లు పొంద‌వ‌చ్చన్నారు. ఇప్పటి వ‌ర‌కు 130 ఉద‌యాస్తమాన సేవా టికెట్లు ఆన్‌లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు.  


స్లాట్ లేకుండా తిరుమలకు నో ఎంట్రీ


"కరోనా ముందు దర్శనాలు ఎలా ఉండేవో అలా తిరిగి ప్రారంభిస్తాం. టీటీడీ బోర్డు(TTD Board) చెప్పినట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభిస్తాం. దర్శనం లేదా సేవ టోకెన్ ఉంటే గాని తిరుమలకు అనుమతి ఉండదు. స్లాట్ సిస్టమ్ అమలు చేస్తాం. ఇంతకు ముందు స్లాట్ లేకుండా వైకుంఠ క్యూలో వచ్చి వేచి ఉండేవారు. ఇప్పుడు ఆ పద్దతి లేదు. కచ్చితంగా స్లాట్ బుక్ చేసుకున్న వారినే కొండ పైకి అనుమతిస్తాం. అడ్వాన్స్ బుక్కింగ్, డిప్ సిస్టమ్, కరోనా ముందు ఎలా ఉండేదో అదే విధంగా అన్ని సేవలు ప్రారంభిస్తాం. ఉదయాస్తమానం సేవా టికెట్లు సుమారు 500 వరకు ఉన్నాయి. అందులో 130-140 వరకు బుక్ అయ్యాయి."