Anantapur Duplicate Police: దేశ వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు అందరూ తలమునకలై ఉంటే ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు అద్దె పోలీసు చొక్కాలు వేసుకుని రోడ్డుపై హల్చల్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కన దొడ్డి గ్రామ సమీపంలో ఓ ముగ్గురు యువకులు పోలీసులం అంటూ రోడ్డుపై వచ్చే పెద్ద పెద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. రోడ్డుపై వాహనాలను ఆపి వాటి పత్రాలు చూపించాలంటూ వాహన యజమానులను బెదిరించారు. సరైన పత్రాలు చూపించకపోతే ఫైన్ కట్టాలని డబ్బులు వసూలు చేశారు. వారు పోలీసులమే అని నమ్మించేందుకు ఓ బొలెరో వాహనానికి పోలీస్ సైరన్ వేసుకుంటూ  వెళ్లి బళ్లారి నుండి తాడిపత్రి వైపుగా వెళ్తున్న లారీని ఆపి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 


అయితే డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ వాహన పత్రాలు చూపించి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పినా నకిలీ పోలీసులు వినలేదు. వాహనం కండిషన్లో లేదు అని తమ ఇష్టానుసారం మాట్లాడి డబ్బులు డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్ క్లీనర్ తమ వద్ద డబ్బులు లేవు అని చెప్పడంతో వారిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా డబ్బులు ఇవ్వకుంటే మీపై కేసులు కట్టి బొక్కలో తోస్తామంటూ బెదిరించారు. అనంతరం వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్లను లాక్కెళ్లారు. అన్ని పత్రాలు కరెక్ట్ గా చూపించినప్పటికీ వాళ్లు వ్యవహరించిన తీరుపై అనుమానం రావడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులను కలిసి వాకబు చేశారు.


దీంతో గ్రామస్తుడు గుంతకల్లు రూరల్ పోలీసులకు సమాచారం చేయడంతో ఘటనా స్థలానికి నిజమైన పోలీసులు చేరుకున్నారు. దొంగ పోలీసుల బండారం బయటపడింది. లారీ డ్రైవర్ క్లీనర్ తో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే విచారణ చేసి గుత్తి ఆర్ఎస్ కు చెందిన అజయ్ ప్రశాంత్, గుత్తి మండలం లచ్చనపల్లి గ్రామానికి చెందిన  ఆదర్శ్ నకిలీ పోలీసుల అవతారం ఎత్తారని గుర్తించి వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 


వీరు ఇలాంటి ఘటనలు ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలోనే మేం పోలీసులమని రోడ్డుపై హల్చల్ చేసిన దొంగ పోలీసుల వ్యవహారం బట్టబయలు కావడంతో అసలైన పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు.