మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు పరిటాల సునీత చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, అనంతపురం పరిధిలోని పాపంపేటలో రెండు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. పరిటాల సునీత ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


మరోవైపు పరిటాల సునీత దీక్షా శిబిరం వద్ద అర్ధరాత్రి సమయంలో వైసీపీ నేతల హల్ చల్ చేశారు. పరిటాల సునీత చేస్తున్న దీక్షను ఫోటోలు తీసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. అదే సమయంలోనే వైసీపీ నేత వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. వైసీపీ నేతలు రెక్కి నిర్వహించారంటూ పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేత అమర్నాథ్ రెడ్డికి చెందిన వాహనంగా గుర్తించిన పరిటాల వర్గీయులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.