YS Sharmila comments on Chandrababu and CM Jagan: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఓవైపు చంద్రబాబు అయితే, మరోపక్క వైఎస్ జగన్ అని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇద్దరూ కలిసి బీజేపీ మెడలు వంచి ఉండి ఉంటే.. ఈపాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చుండేదని అన్నారు. ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుందని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం అయ్యాక చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఎవరైనా ప్రత్యేక హోదా కోసం నిరసనలు చేస్తే వారిపై కేసులు పెట్టి జైల్లోకి తోయించారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఏపీ కాంగ్రెస్ న్యాయసాధన సభ నిర్వహించింది. పోరాడదాం.. సాదిద్ధాం నినాదంతో ఈ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల చంద్రబాబు, జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు, ధర్నాలు చేశారని షర్మిల గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని జగన్ పిలుపు ఇచ్చిన విషయాన్ని షర్మిల ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను జగన్ తెస్తారని ప్రజలు నమ్మి ఓటేస్తే.. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి అయినా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.