Anantapur News : అనంతపురం నగరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటి ముట్టడికి తెలుగు యువత నాయకులు యత్నించారు. వారికి దీటుగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వర్గీయులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారని తోపుదుర్తి చందు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నాయకులు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. పరిస్థితిని అదుపుచేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. నగరంలో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. నగరంలోని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటి ముట్టడికి తెలుగు యువత, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలను మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, తెలుగు తమ్ముళ్లకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతలు పోలీసులతో తీవ్రంగా ప్రతిఘటించారు. అనంతరం టీడీపీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
టీడీపీ వర్సెస్ వైసీపీ
అనంతపురం నగరంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు పోటా పోటీగా నిరసనలు చేపట్టడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి వ్యాఖ్యలపై టీడీపీ, వైసీపీ మధ్య వివాదం కొనసాగుతోంది. సోమవారం టీడీపీ నేతలు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్ పలువురు నేతలు జిల్లా ఎస్పీనీ కలిసి ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చందుపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారని వెంటనే అతన్ని అరెస్ట్ చెయ్యాలని కోరారు. ఇటీవల కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అలాగే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు.
జాకీ పరిశ్రమ వెళ్లిపోడానికి మా కుటుంబానికి సంబంధంలేదు
ఇవాళ తెలుగు యువత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మద్య వాగ్వాదం తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు పోలీసులు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నిస్తారా అంటు ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నారు. తోపుదుర్తి చందు మాట్లాడుతూ.. జాకీ పరిశ్రమ జిల్లా నుంచి తరలి వెళ్లటానికి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా టీడీపీ నేతలు పదే పదే మా కుటుంబంపై ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అందుకు మనసు నొప్పించి అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు గురించి నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణ చెబుతున్నానన్నారు. నా తరుపున మా పార్టీ తరుపున చంద్రబాబుకు క్షమాపణ చెబుతున్నాను. ఇప్పటికైనా టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేయకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఇదేనా రేపటి సమాజానికి మనం నేర్పించే విధానం అంటూ టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.