అనంతపురం జిల్లా పేరు వింటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కరువు . ఇక్కడి రైతులను కదిలిస్తే కష్టాలు, కన్నీళ్లు కనిపిస్తాయి. పంట వేసిన నాటి నుంచి వర్షపు చుక్క కోసం ఆకాశాన్ని చూస్తూ ఉన్న రైతులను జిల్లాల్లో దాదాపు ప్రతి ప్రాంతంలో చూడొచ్చు. సేద్యం చేయలేక పొలాలను అమ్ముకుని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల బాట పట్టే రైతులు ఉన్నారు. అయితే కఠిన వాతావరణ పరిస్థితుల్లో తమ తెలివితో, ఆధునిక పద్ధతులలో జిల్లాకు చెందిన సోదరులు వ్యవసాయం చేసి కోట్ల రూపాయల వరకు పొందుతున్నారు. అధునాతనమైన వ్యవసాయం చేస్తూ దూసుకెళ్తున్న అన్నదమ్ములపై ప్రత్యేక కథనం.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకట్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన ముగ్గురు సోదరులు వ్యవసాయరంగంలో అద్భుతాలు చేస్తూన్నారు. ఇతర రైతులకు భిన్నంగా పంటను పండించి, భారీగా లాభాలు గడిస్తూ జిల్లా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరువు సీమలో కాసులు కురిపించేలా వ్యవసాయం చేసి స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకొని సాంకేతికతను జోడించి వ్యవసాయ రంగంలో రాజశేఖర్ రెడ్డి సోదరులు మేటిగా ఎదుగుతున్నారు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రాజశేఖర్ రెడ్డి తన అన్నకు, తమ్ముడికి సూచనలు ఇస్తూ వ్యవసాయం చేస్తూ దూసుకుపోతున్నారు . సంప్రదాయ వంటలకు దూరంగా ఉంటూ హార్టికల్చర్ వైపు అడుగులు వేశారు. దానిమ్మ , చీనీ, మునగ, బీరకాయ వంటి పంటలు సాగు చేస్తూ దిగుబడులను అధిక స్థాయిలో పొందుతున్నారు. పంటలను మార్కెట్ రేటుకు అనుగుణంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై , కోయంబత్తూర్, దిండిగల్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ అధిక ఫలసాయాన్ని పొందుతున్నారు. తాను సూచనలు ఇస్తాను కానీ తన సోదరులు సరైన సమయంలో మొక్కలకు అందించాల్సిన ఎరువులు, కీటక సంహారాలను పిచికారి చేస్తూ దిగుబడి రావడానికి ఎనలేని కృషి చేస్తారని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. తెలంగాణపై ఈశాన్య గాలుల ప్రభావం
ఏ మాసాలలో మొక్కలను నాటాలి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని తనను ఆశ్రయించిన రైతులకు సలహాలు ఇస్తూ తోటి రైతుల పట్ల ఈ సోదరులు ఉదార స్వభావాన్ని చూపుతున్నారు. తమ తండ్రి పదిహేను ఎకరాల పొలాన్ని తమకు వారసత్వంగా ఇచ్చారని, ప్రస్తుతం తాము 120 ఎకరాలు సంపాదించగలిగామని వెల్లడించారు. నాగపూర్‌లోరి ఎన్ఆర్‌సీసీ నుంచి సైతం ఉత్తమ జాతీయ అవార్డుతో పాటు జిల్లాకు సంబంధించి నాలుగు ఆదర్శ రైతుల అవార్డులు ఈ సోదరులను వరించాయి. పొలంలో దాదాపు ఆరు ఎకరాలలో కొలనులు తవ్వించి నీటిని నిల్వ చేసారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీటిని సరఫరా చేస్తూ నీటి విలువను చెప్పకనే చెబుతున్నారు. వ్యవసాయం ద్వారా వార్షికాదాయం దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Omicron in AP: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు, ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి.. వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రకటన