Thopudurthi Prakash Reddy : అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి ఉప సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే అడ్డుకున్నామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.  కిడ్నాప్ చేసి హత్య చేయాలని కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రోజురోజుకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. అందుకే కుప్పంలో టీడీపీ కార్యకర్తలతో దాడులకు పాల్పడ్డారన్నారు. కుప్పంలో చంద్రబాబు డ్రామా హాస్యాస్పదంగా ఉందన్నారు. పరిటాల కుటుంబంపై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరిటాల కుటుంబానికి పోలీసులను దుర్భాషలాడడం కొత్తేమికాదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు పరిటాల కుటుంబం కుట్ర చేస్తుందని ఆరోపించారు.  


అందుకే ప్రతిదాడి 


"టీడీపీ నేతలు ధర్నాలు, నిరసనలో పేరుతో కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇది జరిగింది. ఒకవైపు రామగిరిలో ధర్నా చేస్తూ.. చెన్నేకొత్తపల్లి ఉప సర్పంచ్ రాజారెడ్డి ను కిడ్నాప్ చేసి వెంకటాపురం తరలించే ప్రయత్నం చేశారు. కిడ్నాప్ చేసి హత్య చేయాలని కుట్ర జరిగింది. దారిలోనే హత్య చేయాలని కొందరు, వెంకటాపురం తీసుకెళ్లి పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా హత్య చేయాలని ప్రయత్నించారు. బాధితుడు రాజారెడ్డి మాకు సమాచారం ఇచ్చాడు. మా సోదరుడు రాజశేఖర్ రెడ్డికి సమాచారం అందింది. వెంటనే ఆయన రామగిరి ఎస్సైకు తెలిపితే టీడీపీ నేతలు రామగిరిలో ధర్నా చేస్తున్నారు. దానిని అడ్డుకుంటున్నామన్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేదంటే మా పార్టీ శ్రేణులు రంగంలోకి దిగారు. కుంటిమద్ది వద్ద ప్రజలు కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకుంటే వైసీపీ కార్యకర్తలు అక్కడి వెళ్లారు. ఆ తర్వాత మా సోదరుడు రాజశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్లి కిడ్నాపర్ల నుంచి రాజారెడ్డి రక్షించారు. కిడ్నాపర్లు దాడి చేయడంతో ఆత్మరక్షణలో భాగంగా ప్రతిదాడి చేశారు."- ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 



కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్లాన్ 


వైసీపీ కార్యకర్తను కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్రయత్నించారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ కార్యకర్తను రక్షించుకునే ప్రయత్నంలో కిడ్నాపర్లపై దాడి చేశారన్నారు.  పరిటాల కుటుంబం నిజస్వరూపం దాయాలని ప్రయత్నించిన అది దాగడంలేదన్నారు. రాజకీయాల కోసం ప్రతిసారి కులాలను అంటగడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో కూడా కులాలను అంటగట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. హత్యలు, కిడ్నాప్ లు చేసిన వాళ్లు కులాలు అడ్డుపెట్టుకుని బయటపడొచ్చా అని ప్రశ్నించారు. పరిటాల సునీత ఫోన్ చేసి ప్రెస్ మీట్లు పెట్టండని వివిధ కులాల వారికి చెబుతున్నారని ఆరోపించారు. పోలీసులను టార్గెట్ చేస్తూ తిడుతున్నారన్నారు. రామగిరి సీఐ, ఎస్సై లను దుర్భాషలాడడం చేస్తున్నారన్నారు. పోలీసులను తిట్టడం ఓ హక్కుగా భావిస్తున్నారన్నారు. ధర్నాకు వచ్చిన వారి ముందు హీరోయిజాన్ని ప్రదర్శించుకునేందుకు పోలీసులను తిడుతున్నారన్నారు. టీడీపీ నేతలు తిడితే పోలీసులూ తిడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం కూలిపోయిన మూడో రోజే వెళ్లి ఎవరి కాళ్లో పట్టుకుని గన్ మెన్లను తెచ్చున్నారన్నారు. పరిటాల కుటుంబానికి దమ్ము, ధైర్యం ఉంటే గన్ మెన్లను తీసేసి తిరగాలని చాలెంజ్ చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. గన్ మెన్లను తీసేసి ఒక్కరోజు తిరగలేరన్నారు. సీఎంను తిట్టినా, ఎమ్మెల్యేను తిట్టినా పరిటాల కుటుంబాన్ని రక్షించడానికి పోలీసులు కావాలని, కానీ వారిపై దుర్భాషలాడుతున్నారన్నారు. 


"పోలీసులను దుర్భాషలాడిన వారిపై ఫిర్యాదు కూడా చేశాం. అందులో నర్సంపల్లి సర్పంచ్, వడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఉన్నారు. వీళ్లు ప్రజల్ని రెచ్చగొట్టి వారి పనులు చేసుకుంటున్నారు. ఓ పక్క ధర్నా చేస్తూ మరోవైపు పక్కా ప్లాన్ తో మా కార్యకర్తను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అందుకే మా సోదరుడు వెళ్లి వారిని అడ్డుకున్నారు. " - ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి  


టీడీపీ నేతలు మాత్రం 


అయితే రాజారెడ్డి, తన అనుచరులతో టీడీపీ చేరేందుకు వస్తుంటే ఎమ్మెల్యే సోదరుడు దౌర్జన్యం చేసి రాజారెడ్డిని తీసుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరిటాల సునీత సమక్షంలో వాళ్లంతా టీడీపీలో చేరేందుకు వస్తున్నారని, ఆ విషయం తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే సోదరుడు కాపుకాసి దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.  


Also Read : Anantapur News : అనంతపురం సీఐలు అంతేనా, మీసాలు తిప్పుతూ ప్రతిపక్షాలకు వార్నింగ్!