Atchutapuram Gas Leak :  అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్‌ వస్త్ర పరిశ్రమను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. శుక్రవారం విషవాయువు లీక్ అవ్వడంతో సుమారు 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకు కంపెనీ మూసివేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆదేశించారు. సెజ్ లోని సీడ్స్‌ కంపెనీ నుంచి గాఢమైన అమ్మోనియా విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన మహిళలు అనకాపల్లిలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


ప్రమాద ప్రాంతాన్ని పరీశీలించిన మంత్రి 


అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో సెజ్ లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. గ్యాస్ లీక్ పై ఆరా తీశారు. అయితే లీకేజీపై స్పష్టత లేకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రెండు కంపెనీల్లో ఉద్యోగులే ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారన్నారు. విషవాయువులు ఎక్కడ నుంచి వ్యాపించాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. సెజ్ లో ప్రమాదాల నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ ఘటనపై అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 


మరోసారి వైద్యపరీక్షలు 


అచ్యుతాపురం గ్యాస్‌ లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు కొంత మంది డిశ్చార్జ్ అయ్యారు. శనివారం ఎలమంచిలి ఆసుపత్రి నుంచి కోలుకున్న బాధితులు ఇళ్లకు వెళ్లిపోగా, మరికొన్ని ఆసుపత్రుల్లో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితులకు మరోసారి వైద్య పరీక్షలు చేసి డిశ్చార్జ్ చేయాలని వైద్యులకు కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. 


వంగలపూడి అనిత అడ్డుకున్న పోలీసులు


అనకాపల్లి గ్యాస్ బాధిత మహిళలను పరామర్శించేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు అనిత వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆమె పోలీసులపై మండిపడ్డారు. తనకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. గ్యాస్ లీకేజ్ ఘటన పరిశ్రమల నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. తమపై పోలీసులు చాలా కేసులు పెట్టారని, ప్రజల తరపున ఏ సమస్యనైనా ప్రశ్నిస్తామన్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టిన భయపడే పరిస్థితి లేదన్నారు.