Coffee Lower Death Risk : మనలో చాలా మంది రోజు కాఫీ, టీ తోనే మొదలవుతోంది. కెఫిన్-ఇన్ఫ్యూజ్డ్ కాఫీ ఉదయాన్ని ఉత్తేజంగా స్టార్ట్ చేయిస్తోంది. అయితే అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌ అధ్యయనంలో పలు రకాల కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదం తక్కువ అని తేలింది. కాఫీ తాగని వారికే ఎక్కువ డెత్ రిస్క్ అని తేల్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 171,616 మందిని పరిశోధకులు అధ్యయనం చేశారు. కాఫీ తాగే అలవాటుతో సహా వారి జీవనశైలి గురించి ఒక సంవత్సరంలో ఐదు సార్లు సర్వే చేశారు. ఏడేళ్ల తర్వాత సగటున ఎవరు మరణించారో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మరణ ధృవీకరణ పత్రాలను సేకరించారు. సుమారు 37 నుంచి 73 సంవత్సరాల వయసు గలవారు ఈ సర్వేలు పాల్గొ్న్నారు. సర్వే సమయంలో వారికి హృదయ సంబంధ వ్యాధులు లేదా క్యాన్సర్ లేదని అధ్యయనంలో తేలింది.  


కాఫీ తాగని వారికే రిస్క్ 


రోజుకు 1.5 నుంచి 3.5 కప్పుల వరకు మితమైన మోతాదులో కాఫీ తాగే వ్యక్తులకు, కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీని తీసుకున్న వారికి 30% తక్కువ రిస్క్  ఉందని ఫలితాలు వెల్లడించాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో మెడిసిన్ ప్రొఫెసర్, అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌కి డిప్యూటీ ఎడిటర్  డాక్టర్ క్రిస్టినా వీ.. కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగేవారిలో 16% నుంచి 29% తక్కువ మరణ ప్రమాదం ఉందని తెలిపారు. ఈ అధ్యయనంలో సోషియోడెమోగ్రాఫిక్, లైఫ్‌స్టైల్, క్లినికల్ కారకాల అన్వేషణలు కూడా జరిగింది. పరిశోధనా బృందం పొగతాగే స్థాయి, శారీరక శ్రమ,  విద్యా స్థాయి, ఆహారపు అలవాట్ల గురించి ప్రశ్నలు అనేక ప్రశ్నలు అడిగామని క్రిస్టినా వీ చెప్పారు. ఆదాయ స్థాయి, వృత్తి ఫలితాలను ప్రభావితం చేసే ఇతర అంశాల గురించి అడగలేదన్నారు. 


ఒక టీస్పూన్ షుగర్ తో ఎక్కువ ప్రయోజనం


ఈ అధ్యయనం ప్రకారం కాఫీలో 1 టీస్పూన్ చక్కెరను మాత్రమే వినియోగించినట్లు అయితే కాఫీ ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయన్నారు. కాఫీలో కృత్రిమ స్వీటెనర్‌ ను ఉపయోగించిన వ్యక్తుల ఫలితాలు తక్కువ స్పష్టంగా ఉన్నాయన్నారు. "ఈ అధ్యయనం ఆధారంగా, చాలా మంది కాఫీ తాగేవారు తమ ఆహారం నుంచి పానీయాన్ని తొలగించాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కానీ అధిక కేలరీల స్పెషాలిటీ కాఫీల నుంచి జాగ్రత్తగా ఉండాలి" అని అధ్యయన రచయిత డాక్టర్ డాన్ లియు తెలిపారు. ఆమె చైనాలోని గ్వాంగ్‌జౌలోని సదరన్ మెడికల్ యూనివర్సిటీలో ఎపిడెమియాలజీ విభాగానికి చెందినవారు. కాఫీ తీసుకోవడం గుండెను కాపాడుతుందని, ఇతర వ్యాధుల చికిత్సలో సహాయపడుతుందని గత పరిశోధనలో తేలిందని లియు చెప్పారు. ఇది కాలేయ సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని 2021 అధ్యయనంలో తెలిసిందని లియు అన్నారు. 


అరబికా,రోబస్టా రకాలు 


కాఫీ ఉత్పత్తి చేసే విధానంపై వివిధ ఆరోగ్య ప్రొఫైల్‌లను కూడా కలిగి ఉందని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ గుంటర్ కుహ్న్లే చెప్పారు. కొన్ని రకాల్లో ఫినోలిక్ సమ్మేళనాలు ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు.  ఆ రసాయన సమ్మేళనాలు కాఫీ రుచి, సువాసనను ప్రభావితం చేస్తాయని, అవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయని తెలిపారు. కాఫీలో అరబికా, రోబస్టా రకాలు ఉన్నాయి. పరిశోధన ప్రకారం రోబస్టా కాఫీలో అరబికా కాఫీ కంటే ఫినాలిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాల్చని, ఆకుపచ్చ కాఫీ గింజలు అధిక స్థాయిలో ఫినాలిక్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వేయించే స్థాయిని బట్టి కొన్ని ఫినోలిక్ సమ్మేళనాలు విచ్ఛిన్నమవుతాయి. కాఫీలో అధిక స్థాయిలో డైటర్పెనెస్ ఉంటుంది. ఈ రసాయన సమ్మేళనాలు, మీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని కుహ్న్లే చెప్పారు. 2016 అధ్యయనం ప్రకారం కాఫీ,  ఫ్రెంచ్ ప్రెస్ కాఫీలో అత్యధిక మొత్తంలో డైటర్పెనెస్ ఉన్నాయి. మోచా, ఎస్ప్రెస్సో కాఫీలో మితమైన డైటర్పెనెస్ ఉంటాయి. అయితే ఇన్‌స్టంట్ కాఫీలు లేదా వడపోతతో తయారు చేయబడిన కాఫీల్లో వీటి శాతం అతి తక్కువగా ఉంటాయి.


గమనిక: అధ్యయనంలో పేర్కొన్న వివరాలను ఈ కథనంలో యథావిధిగా అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు. గుండె సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే కాఫీ తదితర ఆహారపానీయలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు.