Anakapalli News : అనకాపల్లి నర్సీపట్నం గోలుగొండ మండలం కొత్త ఎల్లవరంలో స్థానిక నేత  కక్షపూరితంగా వ్యవహారించి పావాడ వెంకటలక్ష్మి అనే ఒంటరి మహిళ పాకను  తొలగించారని గ్రామ సర్పంచ్ కొల్లి రాంబాబు తెలిపారు. వెంకటలక్ష్మికి గ్రామంలో ఓటు హక్కు లేదని ఏ పార్టీకి సంబంధించిన మహిళ కాదని ఆమెపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని వాపోయారు. ఆమె చెల్లెలు ఎమ్మెల్యే గణేష్ ఇంటి వద్ద పనిచేస్తూ ఉంటదని అయినా ఎమ్మెల్యే గణేష్ కనికరించలేదన్నారు. తన ఇంట్లో పని చేసే వారికే న్యాయం చేయలేని ఎమ్మెల్యే ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఇళ్లు ఖాళీ చేసేందుకు మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా అధికారులతో నిర్ధాక్షిణ్యంగా ఆమెను రోడ్డు పాలు చేశారని ఆరోపించారు. 


సమయం కోరినా 


వివరాల్లోకి వెళితే చెరువు ఆక్రమణకు గురైందని అందిన ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. 20 ఏళ్ల క్రితం చెరువు ఒడ్డున వేసుకున్న పూరి పాకను రెవెన్యూ అధికారులు, ఎస్ఐ నారాయణరావు దగ్గరుండి తొలగించారు. కానీ అదే చెరువును అనుకోని ఇళ్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. కొత్తఎల్లవరం గ్రామంలో చెరువుకు చెందిన స్థలంలో ఎనిమిది మంది ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో ఐదు పక్కా భవనాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే పావాడ వెంకటలక్ష్మికి చెందిన పూరి పాకను మాత్రమే రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో వెంకటలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురై రోడ్డుపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. వారం రోజుల్లో ఆక్రమణ తొలగిస్తామని గ్రామ సర్పంచ్ కొల్లి రాంబాబు అధికారులను కోరినప్పటికీ తమకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం మిగిలిన, పక్కా భవనాలకు నోటీసులు ఇచ్చారు. త్వరలో ఆక్రమణలు తొలగిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. 


స్థానిక నేతల ఒత్తిళ్లు 


ఉన్న ఒక్క ఆధారం పోవడం సదరు మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దూకింది. సమయానికి స్థానికులు చూడడంతో ఆమె రక్షించారు. అయితే అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయడానికి సమయం ఇవ్వలేదని ఆరోపించారు. స్థానిక నేత ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు ఇళ్లు తొలగించారన్నారు. మహిళకు గ్రామంలో ఓటు హక్కులేదని అందుకే కక్షతో ఇళ్లు తొలగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంకటలక్ష్మి సోదరి ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తుందని అయినా కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించారన్నారు. రెండేళ్లుగా వెంకటలక్ష్మిని ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు అంటున్నారు. గ్రామంలో పెద్దల ఒప్పందంతో ఇలా ఇళ్లు కట్టుకున్నారని గ్రామస్థులు అంటున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లతోనే ఇళ్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.  అయితే అధికారుల మాత్రం ఆక్రమణలు తొలగిస్తున్నామని తెలిపారు. ముందు పూరిపాకను తొలగించామని, మిగిలిన ఇళ్లకు నోటీసులు ఇచ్చి వాటిని తొలిగిస్తామని చెబుతున్నారు. 


Also Read : CM Jagan : వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు అధికారం మనదే - సీఎం జగన్