Andhra News :   ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ ధృవపత్రాలు జారీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విచారణాధికారిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్‌ను నియమిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ ఆఫీసు బేరర్ లేఖలు, ధృవ పత్రాలు ఏపీజీఈఏ జారీ చేస్తోందన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్టీఓలు, ఎస్ఆర్ఓ, ఏటీఓ, సీటీఓలు, డీసీటీవోలు, వైద్యులకు, వివిధ విభాగాల ఉద్యోగులకు ఏపీజీఈఏ నకిలీ లేఖలు జారీ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. సాధారణ బదిలీల నుంచి మినహాయింపు పొందేలా ఈ నకిలీ లేఖల్ని వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.


ఇప్పటికే  ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  డీలర్లు, ఏజెన్సీలు, ఆడిటర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారన్న అభియోగాలతో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు.  ఏ1గా బలిజేపల్లి మోహర్‌కుమార్‌, ఏ2గా కొచర్లకోట సంధ్య, ఏ3గా కావూరి వెంకట చలపతి, ఏ4గా మరీదు సత్యనారాయణను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పోలీసులు.. ఏ5గా కేఆర్‌ సూర్యనారాయణ పేరును చేర్చారు. సూర్యనారాయణ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షునిగా ఉన్నారు.  ఈ నలుగురు నిందితులు కేఆర్‌ సూర్యనారాయణతో కలిసి డీలర్లు, ఆడిటర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆ నలుగురు నిందితులను విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో గురువారం ప్రవేశపెట్టారు. జడ్జి రాజశేఖర్‌ ఆ నలుగురికీ 14 రోజుల రిమాండ్‌ విధించారు.


కేఆర్‌ సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్‌ హోదాలో ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్నారు. అయితే, పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో సూర్యనారాయణ పేరు ప్రస్తావించడం సంచలనంగా మారింది.   కేఆర్‌ సూర్యనారాయణతో పాటు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న మరికొంతమందితో కలిసి జీఎస్టీ చట్టాలను ఉపయోగించుకుని డబ్బుల కోసం డీలర్లు, వ్యాపారులను బెదిరించారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.  


ఏపీ జీఎస్టీ యాక్ట్‌–2017ను ఉల్లంఘించి ఈ ఐదుగురు నిందితులు వ్యవహరించారు. తద్వారా స్వప్రయోజనాలను పొందారు. దీనిపై విజయవాడ–1 ఇంటెలిజెన్స్‌ విభాగ జాయింట్‌ కమిషనర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. సాక్షుల నుంచి సీఆర్పీసీ 161 ప్రకారం వాంగ్మూలం తీసుకున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రికి వైద్య పరికరాలు సరఫరా చేసిన సంస్థకు ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి నోటీసులు జారీ చేశారు. జరిమానాతో కలిపి జీఎస్టీని చెల్లించాలని పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. ఈ కేసులతో పాటు తాజాగా నకిలీ ధృవపత్రాల పై విచారణకు ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.