బీసీల‌కు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేయాల‌ని వైసీపీ బీసీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో కేంద్రం వెంట‌నే జోక్యం చేసుకోవాల‌న్నారు. అసవ‌రమైతే ప్రత్యేకంగా ప్రధానమంత్రిని క‌ల‌సి విన్నవించాల‌ని కూడా తీర్మానించారు. దిల్లీలోని ఆంధ్రాభ‌వ‌న్‌లో వైసీపీ బీసీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, సత్యవతి, తలారి రంగయ్య మీడియాతో మాట్లాడారు. 


బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి.. బడ్జెట్‌లో కనీసం లక్ష కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్రాల్లో బీసీల పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్‌ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలన్న వైసీపీ ఎంపీలు... ప్రైవేటు రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తుల నియామకాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 


సామాజిక న్యాయం అమలులో సీఎం జగన్ దేశంలోనే ఒక రోల్‌మోడల్‌గా నిల్చారని పొగడ్తలతో ముంచెత్తారు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు. మంత్రి పదవులు మొదలు అన్ని నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు.  మంత్రివర్గంలో ఏకంగా 10 మంది బీసీలు ఉన్నారని తెలిపారు. నిజానికి తమది బీసీల పార్టీ అని చెప్పుకున్న  పార్టీలు కూడా ఆ పని చేయలేదన్నారు ఎంపీలు. రాజ్యసభ టికెట్ల విషయంలో కూడా బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 9 మంది రాజ్యసభ సభ్యులుంటే అందులో నలుగురు బీసీలే ఉన్నారని గుర్తు చేశారు. 


బీసీలకు 50 శాతం పదవులు ఇస్తూ ఏకంగా చట్టమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిందని వివరించారు వైసీపీ ఎంపీలు.కార్పొరేషన్లలో 109 పదవులు బీసీలవే అన్నారు. అలా ప్రభుత్వంలో 76 శాతం పదవులు బీసీలకు ఇచ్చారని పేర్కొన్నారు. అన్ని పథకాల్లోనూ బీసీలకు పూర్తి న్యాయం చేస్తున్నారని... ఓటు బ్యాంక్‌ రాజకీయాలు కాకుండా నిరుపేదలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారన్నారు. అందుకే సీఎం జగన్‌ ఒక తత్వవేత్త, సిద్దాంతకర్త అని కొనియాడారు ఎంపీలు. తమకు జగన్ వల్లనే న్యాయం జరుగుతోందని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలు నమ్మకంతో ఉన్నారన్నారు. సీఎం జగన్‌ కృషిని చాలా రాష్ట్రాల నాయకులు అభినందిస్తున్నారన్నారు.  


ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ


బీసీల సంక్షేమం, అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ వారంలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు వైసీపీ ఎంపీలు. ప్రధాని స్వయంగా ఒక బీసీ అయినందున న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 


బీసీలకు న్యాయం జరగడం లేదు:


దేశంలో బీసీలు దాదాపు 75 కోట్ల మంది ఉన్నారని... అంత పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నప్పటికీ వారి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేకపోవడంతో విద్య, ఉద్యోగ రంగాల్లో న్యాయం జరగడం లేదన్నారు. కేంద్రంలో మొత్తం 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయని... తాజాగా సహకార, మత్స్యశాఖలు ఏర్పాటు చేశారన్నారు. మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు మొదలుపెట్టి 30 ఏళ్లు అవుతోందని... వాటన్నింటికీ చూడడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ కావాలన్నారు. అప్పుడే ఆర్థికపరమైన రాయితీలు, స్కాలర్‌షిప్స్, రుణాలు, సబ్సిడీ రుణాలతోపాటు, బీసీలకు సంబంధించిన పథకాల అమలు తీరు చూసే వీలుంటుందన్నారు. 


29 రాష్ట్రాల్లో బీసీ మంత్రిత్వ శాఖలు


కేంద్రంలో కూడా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన సంగతి గుర్తు చేశారు వైసీపీ ఎంపీలు. మండల్‌ కమిషన్‌పై వేసిన కేసు విచారణ సందర్భంగా 1992–93లోనే సుప్రీంకోర్టు కూడా ఈ సూచన చేసిందన్నారు. అయినా ఇప్పటికీ ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేయకపోవడం సరికాదని తప్పపట్టారు. కాబట్టి వెంటనే కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. 


రాజ్యాంగపరమైన హక్కు


వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బీసీ పథకాలు, కార్యక్రమాలకు కేంద్రం తన గ్రాంట్‌ 60 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీలు. కొత్తగా మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు ఉండబోవని...ఇది రాజ్యాంగపరమైన హక్కని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటులో బిల్లు పెట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. దీనిపై రాజ్యసభలో మూడేళ్ల క్రితమే ప్రైవేటు బిల్లు కూడా పెట్టామన్నారు. దానికి చాలా పార్టీలు మద్దతు ప్రకటించినా కేంద్రం సానుకూలంగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉందన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు. 


పార్లమెంటులో బీసీలకు సంబంధించి 8 పార్టీలు ఉన్నా... దాదాపు 150 మంది బీసీ సభ్యులున్నా బీసీ బిల్లు గురించి ఆలోచించలేదని ఎద్దేవా చేశారు. జగన్‌ చొరవతో తాము బీసీ బిల్లు తీసుకొచ్చామని... అది ఆమోదం పొందే వరకు పోరాడుతామన్నారు. 


బీసీలకు కేంద్రం తగిన న్యాయం చేయడం లేదని విమర్శించారు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు. బీసీలకు కనీసం లక్ష కోట్ల బడ్జెట్‌ పెట్టాలన్నారు. బీసీలకు కేవలం రూ.1400 కోట్లు మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. అందువల్ల కనీసం లక్ష కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లో అమలు చేసే పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలన్నారు. 


ప్రైవేటు రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని... సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కూడా బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని కోరారు వీటన్నింటిపై ప్రధానికి విజ్ఞప్తి చేయబోతున్నామ‌న్నారు.