అంచనాలకు మించి వైసీపీ ప్లీనరీ విజయవంతమవుతుందన్నారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్లీనరీ ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీపై కూడా ఘాటైనా విమర్శలు చేశారు. చంద్రబాబుకు మెయిన్ చిప్‌ దెబ్బ తిందని కామెంట్ చేశారు. 


తొలిరోజు వైసీపీ ప్లీనరీకి 70 వేల మంది వస్తారని అంచనా వేస్తే... లక్షా అరవై వేల మంది హాజరయ్యారని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. వచ్చిన వారంతా కార్యకర్తలేనని... ఎక్కడా సామాన్య జనాన్ని తరలించలేదని వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్నా ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. జనాలను సభలకు తరలించే అవసరం తమకు లేదని... వచ్చిన వారంతా అభిమానంతో వచ్చారే తప్ప ఎవరి బలవంతంతో ఇక్కడకి రాలేదన్నారు. 


ప్లీనరీ ప్రారంభానికి ముందు, అయిపోయిన తర్వాత కుర్చీలు ఖాళీగా ఉండడం సహజమన్నారు విజయసాయిరెడ్డి. టిడిపి నేతలు వాటిని చూపించి తప్పుడు ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఉన్న మెయిన్ చిప్ దెబ్బతిందని కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్లీనరీకి ఎంతమంది వచ్చారో తాను ఉపయోగిస్తున్న రెండో చిప్ ద్వారా తెలుసుకోవాలని విజయసాయిరెడ్డు సూచించారు. 


టిడిపి నేతలు తమ పార్టీ నాయకుల కుటుంబం, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వస్తే తాము రెండింతలుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలన్నీ రాజకీయాల్లో ప్రవేశపెట్టింది లోకేష్ అని అన్నారు. తమ నాయకులపై అసభ్య పదజాలాన్ని టీడీపీ ఉపయోగిస్తున్నందునే తాము కౌంటర్ ఇస్తున్నామని... తమ పార్టీ నేతలు ఎక్కడా గీత దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. రాజకీయాలనేవి రాజకీయాలుగానే చేయాలి కానీ... వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. తండ్రి వెన్నుపోటు, లోకేష్ చేసిన కార్యకలాపాలు గురించి తాము కూడా స్పందించవచ్చని కానీ వాటి జోలికి పోవడం లేదన్నారు సాయిరెడ్డి.






అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి విజయమ్మ ఎందుకు తప్పుకుంటున్నారో సవివరంగా చెప్పారన్నారు విజయసాయిరెడ్డి. షర్మిలకు తోడుగా ఉండడం కోసం విజయ వెళ్తున్నారన్నారు. దీనిపై రాద్దాంతం సరికాదన్నారు. జగన్ సతీమణి భారతి ఏ రోజు రాజకీయాల్లో లేరని... పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని వివరించారు. కుటుంబ వ్యవహారాలకే పరిమితమయ్యారని తెలిపారు. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు సంతోషంగా ఉండడం చంద్రబాబుకు నచ్చదన్నారు విజయసాయిరెడ్డి. ఈ కులాలంటే చంద్రబాబుకు  ఈర్ష,  ద్వేషం అని అన్నారు. ఎంతసేపు తన సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరుకుంటారన్నారు.