YSRCP MLA Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీకి రాజీనామా చేయబోతుండడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరబోతున్నట్లుగా వసంత కృష్ణప్రసాద్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత పది రోజులుగా నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్‌ అందుబాటులో లేరు. మరోవైపు, నందిగామ మండలం ఐతవరంలోని తన ఇంట్లో కార్యకర్తలతో కృష్ణ ప్రసాద్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. తన అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో చర్చించి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వసంత కృష్ణప్రసాద్‌ ఈ నెల 8న టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా ఉంది.


ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారతారనే ప్రచారం చాలాకాలంగా ఉన్న సంగతి తెలిసిందే. అలా గతంలో ప్రచారం ఎక్కువగా జరిగినప్పుడు కూడా.. ఆయన సీఎం జగన్ ను కలిసి తాను వైసీపీలోనే ఉంటానంటూ క్లారిటీ ఇచ్చారు. 


తాజాగా ఏలూరులో శనివారం జరిగిన వైసీపీ ‘సిద్ధం’ సభకు కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాజరు కాలేదు. ఈ సభ కోసం ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ ఇన్‌చార్జి పడమట సురేశ్ బాబుకు బాధ్యతలు అప్పగించి, సిద్ధం సభకు మైలవరం నుంచి భారీగా జన సమీకరణ చేయాలని అధిష్ఠానం ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వసంత దీనికి దూరంగానే ఉన్నారు. సిద్ధం సభకు హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ వీడడం ఖాయమని స్పష్టం అయినట్లేఅని చర్చ జరుగుతోంది. అన్ని విషయాలు ఫిబ్రవరి 5న ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని ఇదివరకే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.


తన మైలవరం టిక్కెట్ జోగి రమేష్ కు ఇచ్చే అవకాశాలు బాగా ఉండటంతో వసంత పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి జోగి రమేశ్‌కు ఎమ్మెల్యే వసంతకు విభేదాలు ఉన్నాయి. అక్కడ జోగి రమేష్ వర్గం ఒకటి ఏర్పడి, స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా పని చేయటం ప్రారంభించారు. ఇది వసంతకు ఇబ్బందిగా మారింది. ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసన సభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టడం అదే సమయంలో జోగికి మంత్రి పదవిని కూడా ఇప్పించటంతో వసంత అవమానంగా భావించారు. మైలవరంలో మంత్రి జోగి రమేష్, శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలపై ఇరువురు నేతలు బాహాటంగానే కామెంట్స్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహరంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయితీ కూడా చేశారు. అయినా ఇరువురు నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు. అయితే ఇంత జరిగినా హైకమాండ్ జోగి రమేష్ కే అండగా ఉందన్న భావనతో  వసంత కృష్ణ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.