YSRCP Vs TDP :   వైఎస్ఆర్‌సీపీలో  త్రీ ఇడియ‌ట్స్ అంటూ కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు నేతలపై  టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.  టీడీపీ నేత‌ల కామెంట్స్ పై వైసీపీ నేత‌లు కూడ కౌంట‌ర్ అటాక్ ఇస్తున్నారు. వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ను ఉద్దేశించి టీడీపీ నాయ‌కులు ఉమ్మ‌డి కృష్ణాజిల్లా విస్తృత స్దాయి స‌మావేశం లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తొడ‌లు కొట్టి మ‌రి హాట్ కామెంట్స్  చేశారు.  వీరి కామెంట్స్ పై దేవినేని అవినాష్ కూడా స్పందించారు. టీడీపీ నేత‌ల చీక‌టి బ‌తుకులు త‌న‌కు తెలుసున‌ని, వారు రాజ‌కీయ  లబ్ధి కోసం శ్రీరంగనీతులు చెబితే ప్రజలు ఎవరు నమ్మరని అవినాష్ ప్రకటించారు.


చంద్రబాబు చీవాట్లు పెట్టారనే వైఎస్ఆర్‌సీపీ నేతల్ని తిడుతున్నారన్న అవినాష్ 


చంద్రబాబు నాయుడు చివాట్లు పెట్టగానే  టీడీపీ నేతలు త‌మ‌పై రెచ్చిపోయి మాట్లాడితే చూస్తూ ఊరుకోమ‌ని  దేవినేని అవినాష్  హెచ్చ‌రించారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన‌రావు రాజకీయ చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కు జరిగిన అవమానం పై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 2024లో జరిగే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంతో  పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో  వైసీపి జెండా ఎగరడం ఖాయమని అవినాష్ జోస్యం చెప్పారు.


అమరావతి కోసం టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలన్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి 
 
మాజీ మంత్రి ,విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు కూడ స్పందించారు.అమరావతి రాజధాని కావాలంటే తూర్పులో గద్దె రామ్మోహన్ రాజీనామా చేసి తిరిగి గెలవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. దీనిని రిఫరండం గా తీసుకుని గద్దె రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని కోసం జరుగుతున్న ఆందోళన, పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న ఉద్యమమని ఆయన అభివర్ణించారు. నిజంగా రైతుల ఉద్యమమైతే రాష్ట్రంలోని ఖరీదైన కార్లన్నీ పాదయాత్రలో ఎందుకుంటాయని ఆయన ప్రశ్నించారు.  ఉమ్మడి జిల్లా టిడిపి సమావేశంలో బుద్దా వెంకన్న కన్నీటి పర్యంతం కావడం చూస్తే ఆ పార్టీలో బీసీలకు ఇచ్చిన స్థానం ఏమిటో అర్థంచేసుకోవచ్చన్నారు. టీడీపీ కి వ‌చ్చే ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా రావ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 


మంత్రి పదవుల కోసం టీడీపీ నేతల్ని తిడుతున్నారని వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు


విస్తృత స్దాయి స‌మావేశం పెట్టుకొని టీడీపీ నేత‌లు వైసీపీ నేత‌ల‌ను కావాల‌నే టార్గెట్ చేసి మ‌రి కామెంట్స్ చేయ‌టం పై వైసీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.విజ‌య‌వాడ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేత‌లు ఈ వ్య‌వ‌హ‌రం పై మండిప‌డుతున్నారు. టీడీపీ నేత‌లు రాజ‌కీయంగా ఎదుర్కోలేక మైండ్ గేమ్ ను ఆడుతున్నార‌ని, అందులో భాగంగానే కొడాలి నాని, వంశీ, అవినాష్ ను టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్య‌లు చేస్తున్నారని అంటున్నారు. కేవ‌లం మంత్రి ప‌ద‌వి రావ‌టం లేద‌నే ఉద్దేశంతో కొడాలి నాని, వంశీ పార్టి ని వీడి బ‌య‌ట‌కు వెళ్లి టీడీపీని రాజ‌కీయంగా విమ‌ర్శించ‌కుండా,కుటుంబ స‌భ్యుల‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌టం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.