AP Elections in 2024:
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, ఇక మనమంతా మెజార్టీ పెంచేందుకే పనిచేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాడర్ కు పిలుపునిచ్చారు.
క్యాడర్ తో సజ్జల టెలికాన్ఫరెన్స్...
వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ర్టంలోని ప్రజలంతా కోరుకుంటున్నారని వైసీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ పారదర్శకమైన పరిపాలన పట్ల ప్రజల అభిమానం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా వైయస్సార్ సిపి విజయం ఖాయమైందని అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, జేసీఎస్ కో ఆర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి క్యాడర్ కు మార్గనిర్దేశం చేశారు.
ఓటర్ల జాబితాపై జాగ్రత్తలు...
ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ జరుగుతున్న క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితా సవరణ కు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించే అంశంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ లో భాగంగా ఇంటింటికి తిరిగే కార్యక్రమం కాబట్టి బూత్ లెవల్ ఏజంట్స్ ద్వారా తగిన కసరత్తు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు హయాంలో దాదాపు 60 లక్షలకు పైగా దొంగ ఓట్లను చేర్పించారనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని గుర్తించి తొలగించే విధంగా ప్రజాస్వామ్య పధ్దతిలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా కీలకమైన అంశంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పరిశీలకులను అలర్ట్ చేసిన సజ్జల...
ఇటీవల పార్టీ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో ఏ విధంగా వ్యవహరించాలో కూడా తెలియచేశామని, పరిశీలకులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో బాధ్యతతో పని చేసేందుకు అత్యధిక సమయం కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లకు, సమన్వయం చేసి ఆయా నియోజకవర్గాలలో అందరూ కలిసికట్టుగా పని చేసేలా చూడాలన్నారు.
జగనన్న సురక్ష విజయవంతం...
గృహ సారధులు, జగనన్న సచివాలయ కన్వీనర్లు కలసి నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలు పూర్తి స్దాయిలో విజయవంతం అయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా వారికి కావాల్సిన సేవలు ఇంటి వద్దకే అందించే రీతిలో జగనన్నే మా భవిష్యత్తు, సురక్ష కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రజల అవసరాలు తీర్చడంలో ఇలాంటి కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని రుజువు చేసిందన్నారు. ఈ కార్యక్రమాల పట్ల పార్టీ శ్రేణుల నుంచే కాకుండా ప్రజలనుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. దేశంలోనే ఇది వినూత్నమైన కార్యక్రమంగా సజ్జల పరిగణించారు.