YS Jagan : చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం జరిగే పనులకే 70000 కోట్లకుపైగా నిధులు కావాలని దాని కోసం ఎడాపెడా అప్పులు చేస్తున్నారంటూ ఆయన  విమర్శించారు. ఇవన్నీ ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి  ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ బలపడే ఆలోచన చేస్తున్నారని ఈ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైందని ఎనలిస్ట్‌లు అంటున్నారు. 

అమరావతికి దారేది ? జగన్ మాటల అర్ధం అదేనా?

అవునన్నా కాదన్నా వైసీపీ  అమరావతి ప్రాంతంలో బాగా బలహీన పడింది అనేది 2024 ఎన్నికలు నిరూపించిన సత్యం. ఏకంగా 151 ఒక సీట్లతో 2019లోకి అధికారం లోకి వచ్చినా మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకువచ్చి వైసిపి పూర్తిగా దెబ్బతింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ  వైజాగ్ లో చేసిన హడావిడి వర్కౌట్ కాలేదు సరికదా అప్పటి వైసీపీలో కీలకంగా వ్యవహరించిన  మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి నేతల మధ్య ఉన్న విభేదాలు వైజాగ్ లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి అన్న ప్రచారం ఉంది. దానికి తోడు స్థానికంగా పెరిగిపోయిన భూకబ్జాలు.. వివాదాలు 2024 ఎన్నికల్లో  వైజాగ్ ప్రాంతంలో పార్టీని దెబ్బతీశాయి.

అమరావతిలో అయితే జగన్మోహన్ రెడ్డి రాజధానికి వ్యతిరేకమనే భావన బలంగా పాతుకుపోయింది. రాజధానిని తమ నుంచి తరలించుకపోతున్నారని వారు ఏకంగా ఉద్యమానికి దిగారు. ఆ ఉద్యమం తీవ్రంగా సాగింది. వాళ్ళని డీల్ చేసే విధానంలోనూ జగన్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది అన్న విశ్లేషణలు ఇప్పటికీ ఉన్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఒక శత్రువుగా భావిస్తున్నారు. అక్కడ స్థానిక వైసిపి నేతల్లోనూ ఈ భయం ఉంది. ప్రధానంగా అమరావతిలో రాజధాని అనగానే అక్కడి భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అలాంటి పరిస్థితుల్లో రాజధాని అమరావతి నుంచి వెళ్ళిపోతుంది అనగానే  వాళ్లంతా ఆగ్రహం చెందడమే దీనికి కారణం. దీనితో గత ఏడాది కాలంగా  రాజధాని ప్రాంతానికి చెందిన వైసిపి నేతలే కాకుండా మొత్తం పార్టీ కూడా అమరావతిపై స్తబ్దంగానే ఉంటూ వచ్చింది. ఎన్నికల జరిగి ఏడాది అయిపోవడంతో నెమ్మదిగా మళ్లీ రాజధాని ప్రాంతంలో ఉనికి చాటుకోవడం కోసం వైసిపి ప్రయత్నిస్తుంది అన్న సంకేతం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా బయటికి వచ్చింది అంటున్నారు రాజకీయవేత్తలు 

నాగార్జున యూనివర్సిటీ లో రాజధాని పెట్టుకోండి : జగన్ 

తాజా ప్రెస్ మీట్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పింది ఒకటే. రాజధాని పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా నాశనం చేస్తున్నారని. అలాగే అప్పులు ఊబిలో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని. ప్రస్తుతం చంద్రబాబు ఊహిస్తున్న రాజధాని  కట్టడం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని అందుకే రాజధానిని  నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో లేక విజయవాడ గుంటూరు మధ్య  ఒక 500 ఎకరాల్లోనో కట్టుకోవాలని సూచించారు. అంతేకానీ రాజధాని పేరుతో వేలకు వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కరెక్ట్ కాదని విమర్శలు గుప్పించారు. 

జగన్ మిస్ అవుతున్న పాయింట్ ఇదే అయితే మొత్తం ప్రెస్ మీట్ గమనించిన వారికి  క్లియర్ గా జగన్ మిస్ అయిన ఒక పాయింటు తెలుస్తుంది. అంత సులభంగా ఏపీ రాజధానిని యూనివర్సిటీ భూముల్లోనో.. లేక విజయవాడ గుంటూరు మధ్య కొన్ని వందల ఎకరాల భూముల్లోనూ కట్టేసి అవకాశం ఉన్నప్పుడు తమ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రహసనానికి ఎందుకు తెర తీశారు అనేది ఇప్పుడు తెరపైకి వస్తున్న ప్రశ్న. ఆయన ఆ పనే  చేసుకుంటే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి కూడా ఉండేది కాదని అమరావతి ప్రాంత ప్రజలు ఆ పార్టీపై ఇంత వ్యతిరేకత పెంచుకునే వారు కాదని విశ్లేషణలు  వెలువడుతున్నాయి.