YS Jagan Hot Comments On AP CM Chandra Babu: చంద్రబాబు వైఫల్యాల వల్ల వచ్చిన వరదల కారణంగా 60 మంది వరకు మృతి చెందారని... ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని అన్నారు. అసలు నాడు తనను అసభ్య పదజాలంతో దూషించినా తామంతా సంయమనం పాటించామన్నారు. ఇప్పుడు అరెస్టు అయిన వారెవరూ ఆనాడు ఆ ఘటన జరిగిన ప్రదేశంలో లేదన్నారు. అయినా రెడ్‌ బుక్ పాలనలో కక్ష పూరితంగా తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. 


సురేష్‌కు భోరసా


గుంటూరు సబ్‌జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. నందిగం సురేష్‌ను పరామర్శించిన వైఎస్‌ జగన్‌... పార్టీగా అండగా ఉంటుందన్నారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన జగన్... చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తన ఇంటిని ముంపు నుంచి కాపాడుకునేందుకు విజయవాడను ముంచేశారని ఆరోపించారు. దీని నుంచి ప్రజలను మీడియాను డైవర్ట్ చేయడానికి తప్పు మీద తప్పు చేస్తున్నారని అన్నారు. దీనికి మీడియాను కూడా అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. 


తిడితే కోపం రాదా?


అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తనను టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబి దుర్భాషలాడారని గుర్తు చేశారు జగన్. తనను బోసిడీకే అంటూ తిట్టారని దానికి ల... కొ... అని అర్థమన్నారు. అలా ఏక వచనంతో తిడితే తన అభిమానులు, వైసీపీ కార్యకర్తలకు కోపం వచ్చిందన్నారు. ఇలాంటివి ఇకపై జరగకూడదని అనుకున్న వాళ్లు వెళ్లి టీడీపీ ఆఫీస్‌ వద్ద ధర్నా చేశారని తెలిపారు. అయితే అలా ధర్నా చేయడానికి వెళ్లిన వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడి చేయడంతో అక్కడ ఘర్షణ జరిగిందని చెప్పుకొచ్చారు. 


మేం కక్ష సాధింపు చర్యలు తీసుకులేదు


ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అక్కడ అద్దాలు ఇతర వస్తువులు ధ్వంసం అయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తమ ప్రభుత్వం కేసులు పెట్టామన్నారు. వీడియోలు, సెల్‌పోన్ లొకేషన్ ఆధారంగా వారిని అరెస్టు చేశామని వివరించారు. దాన్ని ఇప్పుడు మరోసారి తెరపైకి తీసుకొచ్చి అసలు అక్కడ లేని వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. తనను వ్యక్తిగతంగా తిట్టినప్పటికీ చంద్రబాబుపై తాను కక్ష సాధింపు చర్యలు దిగలేదని గుర్తు చేశారు జగన్.