YS Jagan should apologize for Skipping flag hoisting of tricolor | అమరావతి: దేశ వ్యాప్తంగా ఆగస్టు 15న 79వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలు జరుపుకున్నారు. కానీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇండిపెండెన్స్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయకపోవడం దుమారం రేపుతోంది. దేశంలో ప్రతి వర్గం త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి సంబరాలు జరుపుకుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్యాలెస్‌లకు పరిమితం అయ్యారని కూటమి నేతలు దుయ్యబట్టారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకపోవడం జగన్ అహంకారం మాత్రమే కాదు, దేశానికి స్వాతంత్ర్యం అందించడానికి పోరాడిన వారు, త్యాగాలు చేసిన వారిని అవమానించడమే అన్నారు. దేశ ప్రజలకు వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
జగన్ ఇలా చేయడం సరికాదు.. టీడీపీ నేతలు
విజయవాడ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, లేళ్ల అప్పిరెడ్డి గారు, మాజీ మంత్రులు జోగి రమేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి ఆలూరి సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కానీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కడా జాతీయ జెండాను ఆవిష్కరించలేదని టీడీపీ నేతలు దీన్ని తప్పుపడుతున్నారు. జగన్ తీరు సరికాదని టీడీపీ నేతలు హితవు పలికారు.
జగన్ జీవితంలో మాయగా మచ్చగా..
“ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తిగా స్వాతంత్ర్య దినోత్సవానికి అర్థాన్ని జగన్ గుర్తించకపోవడమేంటి ? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు వైసీపీకి నిరాశ కలిగించి ఉండవచ్చు. కానీ దేశపండుగ ఇండిపెండెన్స్ డేను మర్చిపోవడం ఏంటి? ఇది మీ రాజకీయ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతుంది” అని టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో ఇలా ప్రశ్నించారు.
జగన్ మానసిక స్థితిని సూచిస్తుంది..
మరో టీడీపీ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకపోవడం వైసీపీ అధినేత వైఎస్ జగన్ జెండాను అవమానించినట్టే. పార్టీ అధ్యక్షుడిగా, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నేత స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేయడం ఏంటని తీవ్రంగా తప్పుబట్టారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి జగన్‌కు నిరాశ కలిగించింది. కానీ ఇండిపెండెన్స్ డే రోజు జాతీయ పతాకం ఆవిష్కరించడానికి దూరంగా ఉండటం ఆయన మానసిక స్థితిని సూచిస్తుందని” ధూళిపాళ్ల అన్నారు.
విజయనగరం ఎంపీ కళిశెట్టి అప్పలనాయుడు టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనకుండా మాజీ సీఎం జగన్ చేసిన చర్య ఆయన అహంకారాన్ని బయటపెట్టిందన్నారు. రిక్షావాలా, ఆటో డ్రైవర్లు నుంచి దేశ ప్రధాని వరకు, ఇతర బడుగు వర్గాల వారు దేశభక్తిని చాటుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరించడం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూ స్ఫూర్తి కొనసాగించారు. కానీ మాజీ సీఎం, పార్టీ అధినేత అయి ఉండి జగన్ త్రివర్ణ పతాకం ఎగురవేయకపోవడం అభ్యంతరకరమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. తాను చేసిన తప్పిదానికి జగన్ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.