Rains In Andhra Pradesh Today | విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం (ఆగస్టు 18) నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం, కొత్తగా ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

వర్షాల తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలివే..

ఆదివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షాలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

భారీ వర్షాలతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి విశాఖ మీదుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ కేంద్రం అధికారిణి సుధా వల్లీ తెలిపారు.