YSRCP News: ‘‘చంద్రబాబుకు న్యాయం, ధర్మం రెండూ లేవు. తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు.. చేస్తాడు. అలాంటి దుర్మార్గ వ్యక్తితో మనం యుద్ధం చేస్తున్నాం. విలువలు, విశ్వసనీయతే మనకు ఎప్పుడూ బలం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలతో  మాజీ సీఎం జగన్‌ సమావేశం అయ్యారు. తొలుత నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్, ఆ తర్వాత పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో మాట్లాడారు.


టీడీపీకి మెజార్టీ లేకున్నా పోటీ
‘‘ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ పూర్తి మెజారిటీ ఉంది. మన పార్టీ నుంచి 600కు పైగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉంటే, అదే తెలుగుదేశం నుంచి గెల్చిన వారు 200కు పైబడి మాత్రమే ఉన్నారు. మనకు వాళ్లకు మధ్య 387 స్ధానాల తేడా ఉంది. అంత తేడా ఉన్నప్పుడు మామూలుగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అక్కడ పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టకూడదు. కానీ, అక్కడ టీడీపీ పోటీ చేస్తోంది అంటే దానర్థం.. ప్రజాప్రతినిధుల కొనుగోలుకు సీఎం స్ధానంలో ఉన్న వ్యక్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లే. 


దుర్మార్గుడితో యుద్ధం
సీఎంగా ఉన్న వ్యక్తి  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆ వ్యక్తికి ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ఆ స్ధాయి వ్యక్తి అడుగులు వేసేటప్పుడు.. సమాజం మనల్ని చూస్తుంది కాబట్టి, మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచన చేయాలి. కానీ ఆయనకు అవేమీ లేవు. దురదృష్టవశాత్తూ మనం చంద్రబాబునాయుడు అనే దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నాం. ఈ మనిషికి న్యాయం, ధర్మం లేదు. తన స్వార్ధం కోసం ఏమైనా చెప్తాడు, ఏదైనా చేస్తాడు. 


అదే నా తాపత్రయం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబులా మనం కూడా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మన పార్టీ గెలుపు కోసమే వారు నాకు ఆ సలహాలిచ్చారు. కానీ, అబద్ధాలు చెప్పి గెల్చి, ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏం సంతృప్తి వస్తుంది?. అమలుకు సాధ్యం కాకపోయినా హామీలు ఇస్తే గెలుస్తాం. ముఖ్యమంత్రి అవుతాం. కానీ ఆ తర్వాత కార్యకర్తలు మొదలు ఎమ్మెల్యేల వరకు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా?. ‘జగన్‌ మాట ఇచ్చాడు. కానీ అమలు చేయలేదు’ అనే మాట అనిపించుకోకూడదు. మన పార్టీ పేరు చెప్తే కార్యకర్తలు, నాయకులు కాలర్‌ ఎగరేసుకునేలా ఉండాలి. దాని కోసమే నేను తాపత్రయపడ్డాను. అందుకే ఏనాడూ మోసపూరిత హామీలు ఇవ్వలేదు. 


బొత్స సరైన అభ్యర్థి
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను మన అభ్యర్ధిగా ఎంపిక చేసుకునేటప్పుడు.. మన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే అభ్యర్ధులను అందరినీ అడిగాను. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పేరు చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నిరకాలుగా ధీటైన అభ్యర్ధిని పెట్టాలని అందరూ నాకు చెప్పారు. అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాత అందరూ బొత్స సత్యనారాయణ పేరును సరైన అభ్యర్థిగా నిర్ణయించాం’’ అని జగన్ మాట్లాడారు.