Andhra Pradesh Assembly: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రుల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వాస్తవంగా అల్ఫాబేటిక్ ఆర్డర్‌లో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉండాల్సింది కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ఆయనతో ముందుగానే ప్రమాణం చేయించారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ముటకట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి వస్తోంది. 




మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుంది. అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 17 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ వైసీపీ ఆ మార్క్‌ను కూడా దాటలేకపోయింది. దీంతో వైసీపీ అధినేత సాధారణ సభ్యుడిగా కే లెటర్ తర్వాత ప్రమాణం చేయాల్సి ఉంది. 


మాజీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డితో మంత్రుల తర్వాత ప్రమాణం చేయించాలని వైసీపీ లీడర్లు కొందరు ప్రభుత్వానికి రిక్వస్ట్ పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇలాంటి విషయాలను రాజకీయం చేయదలచుకోలేదని ఎప్పుడు ప్రమాణం చేస్తే ఏముందని అందుకు అంగీకరించినట్టు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. 


వైసీపీ సభ్యుల కోరిక మేరకు జగన్‌ను మంత్రుల తర్వాత ప్రమాణం చేయించారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి సభా ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రమాణం చేసే క్రమంలో జగన్ కాస్త తడబడ్డారు. ముందుగా జగన్ మోహన్ అనే నేను అన్నారు. తర్వాత తేరుకొని జగన్ మోహన్ రెడ్డి అని నేను అంటూ ప్రమాణం చేశారు. అనంతరం అందరికీ అభివాదం చేసి ప్రొటెం స్పీకర్‌ వద్ద అభినందనలు అందుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభలో కాసేపు కూర్చొని సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.