YS Jagan Mohan Reddy | అమరావతి: ‘నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవికి రాజీనామా చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికతకు, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోందని’ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో ఒక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నిష్క్రమించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

Continues below advertisement

3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థులను మోసం చేశారు

ఇదే క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన నైతిక బాధ్యతను పాటిస్తూ, రాష్ట్రంలో అదే కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా అని జగన్‌ నిలదీశారు. లేక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రాజకీయ ప్రమాణాలు, విలువలు మరియు జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ పదవిని కాపాడుకోవడానికే మొగ్గు చూపుతారా అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.

Continues below advertisement

Also Read: Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

జగన్ ట్వీట్‌పై నెటిజన్ల రియాక్షన్ వైరల్

నీట్ లీకేజీ ఉదంతాన్ని ఉటంకిస్తూ AP విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నమైన, ఘాటైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వేసిన ప్రశ్నలపై నెటిజన్లు ప్రధానంగా వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత పరిణామాలను ప్రస్తావిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. "అన్నా.. నిరసనగా మనకున్న ఆ 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్దాం, మన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుందాం" అంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ చేస్తున్న ఆరోపణలు

మరికొందరు నెటిజన్లు నీట్ పరీక్షకు, ఏపీ డీఎస్సీకి పోలిక లేదని స్పష్టం చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కావడం, దానివల్ల పరీక్ష రద్దు కావడం అనేది వాస్తవమని.. కానీ ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడం కేవలం వైఎస్సార్‌సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలు మాత్రమేనని పేర్కొంటున్నారు. అభ్యర్థులు లేవనెత్తిన ప్రతి ఆరోపణకూ సంబంధిత విద్యాశాఖ అధికారులు ఇప్పటికే పూర్తి వివరాలతో స్పష్టతనిచ్చారని గుర్తుచేస్తున్నారు.

అక్రమాలు జరిగితే ఈపాటికే రోడ్డెక్కేవారు

డీఎస్సీలో నిజంగానే అక్రమాలు జరిగి ఉంటే నిరుద్యోగులు, అభ్యర్థులు ఈపాటికే రోడ్లెక్కి పెద్ద ఎత్తున ధర్నాలు చేసేవారని, ఉద్యోగాలు సాధించిన వారంతా ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ కోర్టును ఆశ్రయించడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలకు నిజానిజాలు తెలుసని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న ఆ 11 సీట్లు కూడా ఎలా వస్తాయో చూస్తామంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.