ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఉండిపోయింది. అదే పార్టీలో ఉన్న నందమూరి లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. 


నందమూరి తారక రామారావు శత జయంతి పురస్కరించుకొని ఆర్బీఐ వంద రూపాయల నాణెం ముద్రించింది. ఈ నాణాన్ని రాష్ట్రపతి స్వయంగా ఆవిష్కరించారు. నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్న ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హజరు అయ్యారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎక్కడా కామెంట్స్ చేయటం లేదు. ఇప్పుడెందుకులే అంటూ సైడయిపోయిన వారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ అంటే అందరూ గౌరవించే వ్యక్తి కాబట్టి, ఆయన శత జయంతికి నాణెం విడుదల చేయటం మంచిదేకదా అన్న నాయకులు కూడా ఉన్నారు. 


ఇక్కడే ట్విస్ట్...
ఇదే సందర్బంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి తనను పిలవకపోవటంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తనకు ఆహ్వానం అందకుండా పుంరదేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టిపోశారు. 


ఇంత వరకు బాగానే ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లక్ష్మీపార్వతికి సపోర్ట్‌గా ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదు. దీంతో ఈ వ్యవహరం సొంత పార్టీలోనే చర్చకు దారితీసింది. నందమూరి ఫ్యామిలీ ఇష్యూ ఏది వచ్చినా ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పందించేది లక్ష్మీపార్వతి, కొడాలి నాని తరువాత మిగిలిన నాయకులు రియాక్ట్ అవుతుంటారు.  అలాంటి ఈ వ్యవహరంలో మాత్రం లక్ష్మీపార్వతి ఎకాకిగా మారారనే టాక్ వినిపిస్తోంది. 


నాణెం విడుదలకు తెరవెనుక
ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాల నిర్వాహణలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీనే కీలక పాత్ర పోషిస్తోంది. నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలతో ఆ కుటుంబానికి, అభిమానులకు సంబంధించిన కార్యక్రమంగానే వైసీపీ మొదటి నుంచి భావిస్తోంది. పొలిటికల్‌గా ప్రత్యర్థి పార్టీగా కావడంతో శత జయంతి కార్యక్రమాలను పట్టించుకోలేదు. విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు నాణెం విడుదలకు సంబంధించిన వ్యహరంపై కూడా అదే స్థాయిలో దూరం పాటించారు. నాణెం విడుదల సందర్భంగా బీజేపీ లీడర్లు, టీడీపీ నాయకులు చెట్టాపట్టాలేసుకొని మాట్లాడుకున్నారు. చంద్రబాబు, నడ్డాతో మాటలు కలపటం వంటి అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిశితింగా గమనిస్తోంది.


పొలిటికల్‌గా దీనిపై విజయసాయిరెడ్డి మాత్రం విమర్శలు చేశారు. పురందేశ్వరని టార్గెట్ చేశారు. చంద్రబాబును, బీజేపీని కలపాలని చూస్తున్నారా అనిప్రశ్నించారు. వెన్ను పోటు పొడిచిన వారిని కార్యక్రమానికి పిలవడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.