సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లారు. ఆయన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే కారులో వెళ్లి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఇప్పుడు ఏపీలో పనిచేయడానికి సోమేశ్ కుమార్ ఆసక్తి చూపుతారా? లేక వీఆర్ఎస్ తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. సోమేశ్ కుమార్ సీఎం జగన్ చాలాసేపు భేటీ అయ్యారు. పలు విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే  ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి మొదటి నుంచీ ఆసక్తి చూపని సోమేశ్ కుమార్.. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీఆర్ఎస్ తీసుకోవాలంటే ముందుగా ఏపీలో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆపై వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. జాయిన్ కాకుండా వీఆర్ఎస్ ప్రక్రియ ముందుకెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే సోమేశ్ కుమార్ ఏపీలో రిపోర్ట్ చేశారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సోమేశ్ కుమార్ ఏం చేయబోతున్నారనదేది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది. 


సోమేశ్ కుమార్ ఉత్తర్వులు ప్రభావం 15 మంది అధికారులపై చూపుతుందా?  
సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ తర్వాత ఎవరు ఏపీకి వెళ్లేది? ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ సొంత కేడర్ అయిన ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం, ఆయన్ను రిలీవ్ చేయడం, తెలంగాణకు కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం అన్నీ చక చకా జరిగిపోయాయి. అయితే 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. అయితే సోమేశ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) నుండి క్లియరెన్స్ పొందడం ద్వారా తెలంగాణలోనే కొనసాగారు. అనంతర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అయితే క్యాట్‌ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని కొట్టివేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సోమేశ్ కుమార్‌ను అతని మాతృ (ఆంధ్రప్రదేశ్) కేడర్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు రావడం దాదాపు కన్ఫామ్ అయినట్లుంది.


కేంద్రం ఉత్తర్వులు తమకు కేటాయించకుండా తమకు నచ్చిన రాష్ట్రాల్లో పని చేస్తున్న మరో 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ పై ప్రభావం చూపనుంది. ఐపీఎస్‌ అధికారుల్లో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌, అదనపు డీజీ అభిలాష బిస్త్‌, అభిలాష్‌ మహంతి తెలంగాణలో పనిచేస్తుండగా వారిని మొదట ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఏపీలో తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు మనీష్ కుమార్ సింగ్, అమిత్ గార్గ్, అతుల్ సింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. ఐఏఎస్‌ కేడర్‌ నుంచి సోమేశ్‌ కుమార్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు మొదట కేటాయించిన వాణీప్రసాద్‌, వాకాటి కరుణ, రోనాల్డ్‌ రోజ్‌,ఎం.ప్రశాంతి, కె.ఆమ్రపాలి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. 


వీరితో పాటు తెలంగాణ కేడర్ అధికారులు హరికిరణ్, సృజన, శివశంకర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మరి ఈ అధికారులను అసలు రాష్ట్రానికి తరలించాలని కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేస్తుందో లేదో చూడాలి. సోమేశ్ కుమార్ తెలంగాణలో రిలీవ్ అయి ఒకటి రెండు రోజుల్లో ఏపీ కేడర్‌లో చేరే అవకాశం ఉన్నందున ఈ అధికారులు కూడా తమ రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఏపీ క్యాడర్ కు చెందిన అధికారులు ఇటు తెలంగాణలోనూ అటు కేంద్ర సర్వీస్ ల్లోనూ కొనసాగుతున్నారు. వారంతా ఏపీ చేరతారా? లేదా? అనేది తొందర్లోనే తేలనుందని విశ్లేషకులు చెబుతున్నారు.